నిమ్మగడ్డకు జైలు శిక్ష తప్పదు: పెద్దిరెడ్డి

6 Feb, 2021 13:47 IST|Sakshi

ఎస్‌ఈసీ ఆంక్షలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, తిరుపతి: తనపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ విధించిన ఆంక్షలపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో మంత్రిపై ఎలా చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అధికారిగా ఉన్న వ్యక్తికి నియంత్రణ ఉండాలని హితవు పలికారు. ఎస్‌ఈసీ హోదాలో ప్రభుత్వంతో ఎప్పుడూ చర్చించలేదని, చంద్రబాబు ఆలోచనలతోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు.(చదవండి: నిమ్మగడ్డ మరో వివాదాస్పద ఉత్తర్వులు

‘‘చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టాలన్నదే నిమ్మగడ్డ తాపత్రయం. నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకావాల్సిందే. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదు. నిమ్మగడ్డ తనను తాను రాష్ట్రపతి అనుకుంటున్నారు. చంద్రబాబుకు తెలియకుండా యాప్ తయారైందా? చంద్రబాబు తయారు చేసిన యాప్‌ను నిమ్మగడ్డ అమలు చేశారంటూ’’ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కాగా మంత్రి పెద్దిరెడ్డిపై నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. 

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన నివాసం నుంచి బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచిస్తూ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు శనివారం లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికలు ముగిసే తేదీ 21 ఫిబ్రవరి వరకు ఆయన తన నివాసంలోనే పరిమితం అయ్యేలాగా చూడాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.  మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంతోపాటు చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 21 తేదీ వరకు పెద్దిరెడ్డి తన ఇంటి నుంచి బయటకు రాకుండా నిలువరించాలని డీజీపీకి సూచించారు. నిమ్మగడ్డ ఉత్తర్వులపై వైఎస్సార్‌సీపీ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.(చదవండి: ఏకగ్రీవాలు జరిగితే తప్పేంటి: వైఎస్సార్‌సీపీ)

మరిన్ని వార్తలు