ఈ–బస్సులపై ఆంధ్రజ్యోతి విషప్రచారం

22 Jun, 2021 04:15 IST|Sakshi

ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు

ప్రతీ టెండర్‌ను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపుతున్నాం

రివర్స్‌ టెండరింగ్‌ కూడా చేపడతాం

రాధాకృష్ణవన్నీ తప్పుడు కథనాలు: మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి : విద్యుత్‌ బస్సుల కొనుగోళ్ల టెండర్‌ ప్రక్రియలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ప్రతీ టెండర్‌ను న్యాయ సమీక్షకు పంపిస్తోందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎల్లో మీడియా పనిగట్టుకుని విషపురాతలు రాయడం దురదృష్టకరమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల కొనుగోలుపై ఆంధ్రజ్యోతి కథనాలను తీవ్రంగా ఖండించారు. ఈ–బస్సుల కోసం గతేడాదే టెండర్లు పిలిచినా.. ధర తగ్గే వరకూ నిరీక్షించామన్నారు. రూ.2.5 కోట్లున్న బస్సు ధర ప్రస్తుతం 1.70 కోట్లకు దిగివచ్చిందని తెలిపారు. దీంతో 350 బస్సులకు టెండర్లు పిలుస్తుంటే.. ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఆయన ఇంకేమన్నారంటే..

ప్రతీ కార్యక్రమం పారదర్శకంగా..
ఓలెక్ట్రా, అశోక్‌ లేలాండ్‌ సంస్థలు ఈ–బస్సులకు టెండర్లు వేశాయి. టెండర్‌ నిబంధనలన్నీ న్యాయ సమీక్షకు పంపాం. ఇందులో లేలాండ్, ఓలెక్ట్రాతో పాటు టాటా, జేబీఎం, ఐషర్, ఏఏఎంఎస్‌ హైదరాబాద్, గ్రీన్‌సెల్, వీరా కంపెనీలు పాల్గొన్నాయి. దూరప్రాంతాలకు ఈ–బస్సులు తిప్పొదని, 200 కిలోమీటర్లు తిప్పొద్దంటూ పలు సంస్థలు అభ్యంతరాలు లేవనెత్తాయి. సింగిల్‌ చార్జితో 250 కిలోమీటర్లు వెళ్లాలన్న ఆర్టీసీ నిబంధనలను వీళ్లు తప్పుబట్టారు. అసలు ఇంతవరకూ టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. ఎవరికో ఇస్తున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక విషం కక్కుతోంది. వైఎస్‌ జగన్‌ సర్కారు అత్యంత పారదర్శకంగా ప్రతీ కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతీ టెండర్‌ను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపుతున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ చేపడతాం. అడ్డగోలుగా ఇవ్వడం జరగదని తెలుసుకోవాలి. ఉద్యోగాల భర్తీలో యువత నిరుత్సాహపడొద్దు. భవిష్యత్‌లోనూ మరిన్ని ఉద్యోగాలిస్తాం.  

మరిన్ని వార్తలు