ప్రభుత్వ ఉద్యోగులు సీఎం కుటుంబ సభ్యులు

22 Jan, 2022 04:28 IST|Sakshi

సమాచార, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని సమాచార, రవాణా, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఆదాయం తగ్గి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో గత్యంతరం లేకే ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోయానని ఆయన మానసిక వేదనతో నలిగిపోతున్నారన్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి ఉన్న ప్రభుత్వమిదని చెప్పారు.

సీఎంగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు స్వీకరించగానే.. ఎవరూ అడగకుండానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ఇది ఉద్యోగులపై సీఎం వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రేమకు నిదర్శనమని చెప్పారు. ఐఅర్‌ ఇచ్చినప్పటి ఆర్థిక పరిస్థితి ఇప్పుడు లేకపోవడం వల్లే 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగుపడినప్పుడు మళ్లీ మాట్లాడుకుందామని ఉద్యోగులకు సూచించారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రాష్ట్రానికి సొంతంగా రావాల్సిన ఆదాయం తగ్గిందని.. కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో వచ్చే ఆదాయం కూడా తగ్గిందని వివరించారు. ఆదాయం తగ్గడం వల్లే ఉద్యోగులు ఆశించిన మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ చేయలేకపోయారని చెప్పారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..

ఉద్యోగులకు పరిస్థితి వివరించేందుకు కమిటీ
►రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులకు వివరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్‌ కమిటీ వేశారు. ఈ కమిటీ ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేస్తుంది. సీఎంను దూషిస్తే హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుందా? పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూ, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అసభ్యంగా మాట్లాడటం తగదు. 
►అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు. చంద్రబాబు నైజం తెలిసిన వారెవ్వరూ ఆయన్ను విశ్వసించరు. సీఎం వైఎస్‌ జగన్, ఉద్యోగుల మధ్య తగవు పెట్టడం ఎవరి తరం కాదు.

చట్టం ఎవరికీ చుట్టం కాదు
►గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు తేలితే.. సంబంధిత వ్యక్తులపై సీఎం వైఎస్‌ జగన్‌ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. చట్టం ఎవరికీ చుట్టం కాకుండా చూసే నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌. 
►చంద్రబాబు అక్రమ నివాసం సమీపంలోని కరకట్ట వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేసి.. ప్రైవేటు స్థలాల వద్దకు వస్తే ఇదే రీతిలో దాడి చేస్తామని చెప్పారు. గుడివాడలో ప్రైవేటు స్థలం వద్దకు వెళ్లిన టీడీపీ నేతలను కూడా అదే రీతిలో ప్రైవేటు వ్యక్తులు అడ్డుకుని ఉంటారు. 
►ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, మెగాస్టార్‌ చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారి మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలవంతమవుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వేసిన వెంచర్లలో అమ్ముతున్న ప్లాట్ల ధరల కంటే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో ప్లాట్ల ధరలు తక్కువగా ఉంటాయి. దీనిపై అవాస్తవాలను ప్రచారం చేయడం తగదు.    

మరిన్ని వార్తలు