నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే కఠినంగా..

24 Oct, 2020 11:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌\అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని  సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం చేసిన చట్టాన్ని రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నామని, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యల విషయంలో నిర్ణయం  తీసుకున్నామని పేర్కొన్నారు. ‘సీఎం వైఎస్‌ జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉంటూనే వాహనాలకు అనుమతి. ప్రభుత్వ నిర్ణయాలు పట్ల వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. అడ్డగోలుగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తప్పవు. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నార’ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం సీఎం వైఎస్‌ జగన్‌ రూ.2500కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వాహనదారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. చదవండి: ఏపీఎస్‌ ఆర్టీసీ క్లారిటీ : ప్రతిష్టంభన వీడినట్లేనా!

సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు
ఏపీ-తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీ ఆర్టీసీ బస్సులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బస్సులు అందుబాటులో ఉంచామని మంత్రి పేర్ని నాని తెలిపారు.  పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టల వద్ద  ఏపీ బస్సులు ఉంటాయని చెప్పారు. సరిహద్దుల నుంచి ఊళ్లకు చేరేందుకు బస్సులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నామని చెప్పారు. తెలంగాణ-ఏపీ మధ్య బస్సులు నడిపేందుకు కృషి చేశామని తెలిపారు. టీఎస్ ఆర్టీసీ కార్యాలయానికి సెలవులు కావడంతో నిర్ణయంలో జాప్యం అయిందని అన్నారు. టీఎస్ ఆర్టీసీతో పూర్తి స్థాయి చర్చలు అనంతరం బస్సులు నడుపుతాంమని  వ్యాఖ్యానించారు. ఆర్టీసీ లాభనష్టాలు చూడట్లేదు, ప్రజలు ఇబ్బంది పడకూడదనే తమ ఉద్దేశమని తెలిపారు.

మరిన్ని వార్తలు