Konaseema Issue: నిరసనకారులు తగలబెట్టిన ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్‌

25 May, 2022 13:30 IST|Sakshi

సాక్షి, అమలాపురం: నిరసనకారులు తగలబెట్టిన తన ఇంటిని మంత్రి విశ్వరూప్‌ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. కోనసీమ సాధన సమితి కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సంఘ విద్రోహ శక్తులే దారి మళ్లించి విధ్వంసం సృష్టించారన్నారు. కార్యకర్తలను కంట్రోల్‌ చేయడంలో టీడీపీ, జనసేన విఫలమయ్యింది. నిరసనకారుల ఆందోళనల్లో రౌడీషీటర్లు వచ్చారు. రౌడీషీటర్లే విధ్వంసం సృష్టించారని మంత్రి విశ్వరూప్‌ అన్నారు.

చదవండి: అంబేడ్కర్‌ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'

కాగా, జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్న కొన్ని వర్గాలు మంగళవారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. పక్కా స్కెచ్‌తో జిల్లాలోని దళిత, బీసీ నేతలను టార్గెట్‌ చేసుకుంటూ పెట్రేగిపోయాయి. అమలాపురం ఎర్ర వంతెన సమీపంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ అద్దెకు ఉంటున్న ఇంటిపై దాడికి దిగి నిప్పు పెట్టారు. అల్లరి మూకలు తమ చేతిలోని పెట్రోల్‌ డబ్బాలను ఇంట్లోకి విసరటంతో ఇంటిలో ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయి మంటలు బీభత్సంగా వ్యాపించాయి. ఇంటిలో ఉన్న మంత్రి గన్‌మెన్‌ శ్రీనివాస్, వంట మనిషి ప్రకాష్‌కు గాయాలయ్యాయి.

ఈ సమయంలో మంత్రి విశ్వరూప్‌తో పాటు కుటుంబ సభ్యులెవరూ ఇంటిలో లేకపోవటంతో వారికి ప్రాణాపాయం తప్పింది. ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లి అమలాపురం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యేపై దాడి జరగకుండా ఆ సమయంలో అక్కడున్న ఆయన అనయాయులు అడ్డుకోగలిగారు. ఇంటిలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 
 

మరిన్ని వార్తలు