గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీ 

21 Apr, 2022 04:09 IST|Sakshi
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రి విడదల రజని, పక్కన ప్రిన్సిపల్‌ సెక్రటరీ కృష్ణబాబు

రోగులకు అందుతున్న సేవలపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సమీక్ష  

సాక్షి, గుంటూరు/గుంటూరు మెడికల్‌:  గుంటూరు జీజీహెచ్‌ను బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల అధిపతులు, వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోగులకు అందుతున్న వైద్యం, అందుబాటులో ఉన్న వసతులపై సమీక్షించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్‌ వినోద్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రాఘవేంద్ర తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మంత్రి మాట్లాడుతూ నాడు–నేడు కింద ఆస్పత్రుల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల నిర్మాణాల కోసం ఏకంగా రూ.16 వేల కోట్లకు పైగా తమ ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలలను తీసుకొస్తున్నట్టు తెలిపారు. గ్రామగ్రామానికీ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు తీసుకొస్తున్న గొప్ప ప్రభుత్వం తమదన్నారు. టెలి మెడిసిన్, నాడు–నేడు కార్యక్రమాలతో వైద్య రంగంలో ఏపీ రోల్‌మోడల్‌గా నిలుస్తోందన్నారు. 

మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్ల నియామకం 
నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలల్లో, టీచింగ్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. వైద్య పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెడికల్‌ సూపరింటెండెంట్లు వైద్య సేవలపైనే దృష్టి కేంద్రీకరించేలా.. నూతనంగా మెడికల్‌ అడ్మినిస్ట్రేటర్లను నియమిస్తామని, వైద్య పరికరాలు, శానిటేషన్, సెక్యూరిటీ, సివిల్, ఎలక్ట్రికల్‌ పనులన్నీ అడ్మినిస్ట్రేటర్లు చూస్తారని తెలిపారు.  

మరిన్ని వార్తలు