పవన్‌కల్యాణ్‌.. ఓ కరివేపాకు

8 Nov, 2022 11:13 IST|Sakshi

శ్రీశైలం ప్రాజెక్ట్‌: రాష్ట్ర రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఓ కరివేపాకు లాంటివాడని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. సోమవారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాం«దీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను శ్రీశైలం ప్రాజెక్ట్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రోజా మాట్లాడుతూ అందరినీ కరివేపాకులా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని, అలాగే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పచ్చపత్రికలు, ఛానళ్లు ఎత్తుకు ఎత్తినట్లే ఎత్తి కిందపడేశాయని దీనిని పవన్‌కల్యాణ్‌ గుర్తుంచుకోవాలని తెలిపారు. 

ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉందని ఆ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగితే ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్‌ పర్యటించాల్సింది పోయి పవన్‌కల్యాణ్‌ను కరివేపాకులా ముందుకు తోశారని ఆమె అన్నారు. జనసేన అంటే సైకో సేనలా, రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.

 పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా 3 రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నారని, ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వాసవిసత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులు తెలనాకుల సత్యనారాయణ, శ్రీనివాసరావు, కలువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు