లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు 

27 Jul, 2021 08:12 IST|Sakshi
గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు 

కర్నూలు(సెంట్రల్‌): వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రతి 20 ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఓ మండల స్థాయి అధికారిని నియమించామన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనమండలి విప్‌ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఆగస్టు మొదటి వారం నుంచి నియోజకవర్గాలవారీగా పర్యటించి.. వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో డ్రెయినేజీలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు, రోడ్లతో పాటు ఉపాధి కల్పన యూనిట్లు స్థాపించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మంచినీరు, విద్యుత్‌ సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణాæత్మకమైన సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. 

మరిన్ని వార్తలు