సినిమాలు సందేశాత్మకంగా ఉండాలి 

3 Sep, 2020 10:54 IST|Sakshi
మాతృదేవోభవ చిత్ర యూనిట్‌తో మంత్రి శ్రీరంగనాథరాజు

సాక్షి, పెనుగొండ: సినిమాలు సందేశాత్మకంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని  శ్రీవాసవీ మూవీస్‌ బ్యానర్‌లో కె.హరనాథ్‌రెడ్డి దర్శకత్వంలో సీహెచ్‌ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న ‘మాతృదేవోభవ’ ఓ అమ్మ కథ చిత్రం షూటింగ్‌ను మంత్రి శ్రీరంగనాథరాజు బుధవారం వాసవీ శాంతిధాంలో పూజా కార్యక్రమాల అనంతరం క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.

సితార, సుమన్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, సూర్య, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ, జెమిని సురేష్, రవిప్రకాష్, చమ్మక్‌ చంద్ర, జబర్దస్త్‌ అప్పారావు, సత్యశ్రీ, సోనియా చౌదరి ప్రధాన తారాగణం. పతంజలి శ్రీనివాస్‌ సమర్పిస్తుండగా కథను సితారే కేజేఎస్‌ రామారెడ్డి, మాటలు మరుధూరి రాజా, పాటలు అనంత శ్రీరామ్,  డీఓపీ రామ్‌కుమార్, సంగీతం జయసూర్య సమకూరుస్తున్నారు. పైట్స్‌ డ్రాగన్‌ ప్రకాశ్‌ చేస్తున్నారు. ఈ సదర్భంగా దర్శకుడు కె.హరనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ  అమ్మ, ఆవు ప్రాముఖ్యాన్ని చాటిచెబుతూ కథాంశం ఉంటుందన్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూలు తణుకు పరిసరాల్లో చిత్రీకరించనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్, వైజాగ్, కర్ణాటకల్లో మిగిలిన షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు