ఒక్క నోటీసుతో బాబు ప్రాణాలకు వచ్చిన ముప్పేంది?

16 Mar, 2021 16:43 IST|Sakshi

తాడేపల్లి: ఎన్నెన్నో అక్రమాలు చేసి మీరు దళితుల భూముల్ని కొట్టేశారు.. రాజధాని పేరుతో మీ సొంత వారికి భూములు ఎలా కాజేశారో అందరికీ తెలుసు అని చంద్రబాబుకు అందిన నోటీసులపై విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. నోటీస్‌ ఇవ్వగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు. బినామీల పేరుతో వేలాది ఎకరాలు కాజేశారని, 
ఆ రోజే మేము జరిగిన అక్రమాలు ప్రశ్నించామని గుర్తుచేశారు. విచారణకు సహకరిస్తే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. 


మీలా మాకు వ్యవస్థలను మ్యానేజ్ చేయడం రాదని మంత్రి సురేశ్‌ పేర్కొన్నారు. ఒక్క నోటీసుతో చంద్రబాబు ప్రాణాలకు వచ్చిన ముప్పు ఏముంది అని ప్రశ్నించారు. ఆయన భద్రత విషయంలో కేంద్రం కల్పించుకోవాలి అనడం హాస్యాస్పదమని తెలిపారు. అలిపిరి సంఘటన తర్వాత ఆయన బ్లాక్ క్యాట్ కమాండోలను ఇప్పటికీ ఎలా వాడుకుంటున్నాడో అందరికీ తెలుసుని గుర్తుచేశారు. ఈ పీకే భాష ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని సందేహం వ్యక్తం చేశారు. ఆయన గడ్డంలో వెంట్రుక పీకడం కాదు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని పీకేసిన విషయం చూసుకో అని హితవు పలికారు. దళితుల భూములను కాజేసిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని మంత్రి సురేశ్‌ తెలిపారు. విజయవాడ, గుంటూరు ప్రజల్లో తమపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.

సొంత అజెండా పేరుతో రైతులను మోసం చేసి కృత్రిమ ఉద్యమం నడిపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి సురేశ్‌ తెలిపారు. మూడు రాజధానులతో అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అమరావతిలో సూర్యుడి వేడి 10 డిగ్రీలు  తగ్గించేందుకు మబ్బుల్లో ఏసీ పెడతా అన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రజలను మోసం చేసినట్లు ప్రజలు గమనించారని చెప్పారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తుకు వస్తాయని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఒక్క పథకమైనా గుర్తుకు వస్తోందా.. అని ప్రశ్నించారు. ఇప్పటికే మీ పార్టీ మూసుకుపోయిందని తెలిపారు. ప్రజా తీర్పుతో తమ బాధ్యత పెరిగిందని తెలిపారు. కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామని, సుపరిపాలన, మంచి పాలన అందిస్తామని మంత్రి సురేశ్‌ వివరించారు. 200 రోజులుగా అమరావతిలో దళిత మహిళలు తమకు సెంటు జాగా కోసం పోరాడుతున్నారని, అవి చంద్రబాబుకు కనబడవా అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు