ప్రజలు ఛీ కొట్టినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు..

25 Feb, 2021 11:38 IST|Sakshi

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 

సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై ఎవరెన్ని కుట్రలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభంజనాన్ని ఆపలేరని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన నగరంలోని 38వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఇరిగేషన్‌ స్థలాలను త్వరలోనే రెగ్యులరైజ్ చేస్తామని వెల్లడించారు. రైల్వే స్థలంపై కేంద్ర రైల్వే మంత్రికి సీఎం లేఖ రాశారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దోచుకో.. దాచుకో అన్న విధంగా టీడీపీ నేతలు వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కార్మికుల జీతాలు కేశినేని నాని ఎగ్గొట్టారని, ఇప్పుడు తన కూతుర్ని మేయర్ చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

‘‘కేశినేని నాని.. ఓ పెద్ద గజదొంగ. కుప్పంలో అలజడులు సృష్టించేందుకే చంద్రబాబు వెళ్తున్నారు. చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టినా సిగ్గు రాలేదు. ఇప్పటికైనా ఆయన తన పద్ధతిని మార్చుకోవాలి. మా ప్రభుత్వంలో అవినీతిని సహించం. ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ ఏసీబీ దాడులు చేస్తుంది. అవినీతి రహిత పాలనే మా ధ్యేయమని’’ వెల్లంపల్లి తెలిపారు.

ప్రజలకు చేరువలో సంక్షేమ పాలన: మల్లాది విష్ణు
ప్రతి సంక్షేమ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రజలకు  చేరువ చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గురువారం ఆయన 32 వ డివిజన్‌లో గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను సీఎం జగన్‌.. పేదల గడప వద్దకు చేర్చారన్నారు. విజయవాడలో పేదలకు లక్ష ఇళ్లు ఇచ్చామని పేర్కొన్నారు.

టీడీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిందని.. చంద్రబాబు హయాంలో అవినీతి కబంధ హస్తాల్లో రాష్ట్రం నలిగి పోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో విజయవాడలో రూ.600 కోట్లతో అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. విజయవాడకు కేంద్రం ఇచ్చిన రూ.500 కోట్ల నిధులను చంద్రబాబు తన కంపెనీకి ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సీఎం జగన్ పాలన సాగుతోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
చదవండి:
సంక్షేమ క్యాలెండర్‌: పథకాల అమలు ఇలా.. 
విద్యా రంగంలో కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 'సీబీఎస్‌ఈ'

మరిన్ని వార్తలు