జీవీఎల్‌పై మండిపడ్డ మంత్రి వెల్లంపల్లి

3 Feb, 2021 18:33 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ నేత మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, 40కిపైగా దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విగ్రహాలను చెత్త బండిలో తరలించిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని టీడీపీ, బీజేపీ నేతలు కూడగట్టుకొని దేశవ్యాప్తంగా దుశ్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. రాజ్యసభలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చేసినప్పుడు జీవీఎల్‌ ఎక్కడున్నారన్నారని నిలదీశారు. ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ దర్యాప్తులో ఒక్కో నివేదిక బయటికొస్తుంటే టీడీపీ, బీజేపీ నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు. బీజేపీ నేతలు కూడా కొన్ని సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినా, ఇంత వరకు కేంద్రం ప్రభుత్వం స్పందించలేదని, దీనికి జీవీఎల్‌ ఏమని సమాధానం చెప్తాడని నిలదీశారు. 

రాజమండ్రిలో అర్చకునికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి జీవీఎల్‌ ఏరోజైనా రాజ్యసభలో మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్‌మెంట్‌ కోరడంపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుది.. అందితే జట్టు, అందక పోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. రాష్ట్రంలో గుడులను కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదైతే.. గుడులను నిర్మిస్తున్న ఘనత వైఎస్సార్సీపీదేనని స్పష్టం చేశారు. అంతర్వేది రథాన్ని 1.20 కోట్లతో త్వరితగతిన నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామతీర్థం విగ్రహాల కోసం అశోక్ గజపతిరాజు విరాళం పంపారని, ఆ విరాళాన్ని విగ్రహాల కోసం మాత్రమే వినియోగించాలని మెలిక పెట్టడంతో ఆయన చెక్‌ను వెనక్కు పంపామని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు