‘తపాలా శాఖ అందరికి వారధిగా ఉంటుంది’: వెల్లంపల్లి

9 Dec, 2020 12:00 IST|Sakshi

సాక్షి, విజయవాడ: హిందూ సంప్రదాయాలు, దేవాలయాల పేరుతో పోస్ట్‌కార్డులు ముద్రించడం చాలా సంతోషమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ‘పంచారామస్‌’ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో తపాలా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన పోస్ట్‌ కార్డులను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తపాలా శాఖా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికి వారధిగా ఉంటుందని తెలిపారు. పంచారామాల దర్శనం కార్తీకమాసంలో ఎంతో పుణ్యమని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అన్ని దేవాలయాల వలె ఏపీలో ఉన్న దేవాలయాలకు కూడా పోస్టల్ సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఒకేసారి వర్చ్యువల్‌గా పంచరామాలు దర్శించడం సంతోషమని తెలిపారు. మహాత్ముల గురించి తెలుసుకోవడం యువతకు చాలా అవసరమని చెప్పారు.

చీఫ్ పోస్ట్‌ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచారామాల పిక్చర్ పోస్టుకార్డులు ప్రారంభిస్తున్నామని, ‘ఫిలాటెలీ’ అనేది స్టాంపుల సేకరణ అనే హాబీ అని తెలిపారు. ఫిలాటెలిస్టులకు ఈ పంచారామాల పోస్టుకార్డులు ముఖ్యమైన సంపదని పేర్కొన్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై తపాలా శాఖా పోస్టుకార్డులు తయారుస్తోందని చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ప్రాంతాలపై పోస్టు కవర్లు విడుదల చేశామని తెలిపారు. చారిత్రక ఘట్టాలను డాక్యుమెంట్ చేయడానికి ‘ఫిలాటెలీ’ అనేది ఓ సాధనమని పేర్కొన్నారు. విజయనగరం సిరిమానోత్సవం పేరు మీద కూడా స్పెషల్ కవర్ చేశామని చెప్పారు. ఈ రోజు పంచారామాల పోస్టు కార్డులు ప్రారంభిస్తున్నామని, పోస్టుకార్డుపై వేసే డేట్‌ స్టాంప్ ఈ ఒక్కరోజే ఉంటుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు