హిందూ ధర్మ పరిరక్షణకు ఏపీ సర్కార్‌ ప్రాధాన్యత: మంత్రి వేణు

4 Feb, 2023 20:35 IST|Sakshi

సాక్షి, రామచంద్రాపురం(కోనసీమ జిల్లా): దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం దాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనందకరమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ద్రాక్షారామ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా నాలుగోవ రోజు మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ఇందులో భాగంగానే జీర్ణోద్ధరణకు వచ్చిన స్వామివారి పాత రథం స్థానే నూతన రథం  నిర్మించడానికి సంకల్పించినట్లు తెలిపారు.

నూతన రథం నిర్మాణం కోసం కంచి కామకోటి పీఠాధి మఠం, విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నంద స్వామి ఆశీస్సులతో 45 రోజుల క్రితం నూతన రథం పనులు ప్రారంభించి రికార్డు స్థాయిలో స్వామివారి కల్యాణ సమయానికి నూతన రథం  నిర్మించుకోవడం  శుభపరిణామం అన్నారు.

నూతన రథంలో స్థల పురాణములో తెలిపిన విధంగా  స్వామి వారి దేవాలయంలో ఉన్న వివిధ విగ్రహాల సంబంధించిన చిత్రాలను నూతన రథంలో రథ రూపశిల్పి గణపతాచార్యులు ఏర్పాటు  చేశారని మంత్రి తెలిపారు. నూతన రథం ప్రారంభోత్సవంలో విశాఖపట్నం శారదా పీఠం పీఠాధిపతి స్వాత్మా నంద స్వామి, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డిలతో పాటు దేవాదాయ శాఖకు చెందిన అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు