ప్రజాబలంతో జగన్‌ సీఎం అయ్యారు: పెద్దిరెడ్డి

16 Dec, 2020 13:21 IST|Sakshi

నెల్లూరు జిల్లాలో ఒక బ్రూస్లీ ఉన్నాడు: కాకాణి

సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటాచం మండలం సర్వేపల్లిలో రూర్భన్‌ పథకం కింద రూ. 100 కోట్లతో చేపట్టిన పనులకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు గౌతమ్‌రెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జలజీవన్‌ మిషన్‌ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. అక్కడి నుంచి పూడిపర్తికి చేరుకుని నూతనంగా నిర్మించిన గ్రామసచివాలయం, వాటర్‌ట్యాంక్‌లు ప్రారంభించారు. అనంతరం సర్వేపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మంత్రులు మాట్లాడారు. 

ప్రజాబలంతో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారు: మంత్రి పెద్దిరెడ్డి
'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆశయాలకు కట్టుబడి ఉన్నారు. ఆయన దొడ్డిదారిలో సీఎం కాలేదు. ప్రజా బలంతో తనను తాను నిరూపించుకొని, కష్టపడి సీఎం అయ్యారు. 19 నెలల్లోనే 90 శాతం మేనిఫెస్టో అమలు చేసిన ఘనత సీఎం జగన్‌ది. ముఖ్యమంత్రి మొక్కవోని దైర్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ఒక సుదీర్ఘ విజన్‌తో పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే.. వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఇంతపెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఏ ఎన్నికల్లో అయినా మీరు మన పార్టీలో ఎవరికి ఓటు వేసినా అది వైఎస్‌ జగన్‌కే ఓటేసినట్లు భావించి వేయండి' అంటూ మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

వైఎస్‌ జగన్‌ పోరాట పటిమ దేశానికే ఆదర్శం: డిప్యూటీ సీఎం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటపటిమ దేశానికే ఆదర్శం. కష్టపడి, ప్రజాబలంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. చంద్రబాబు దొడ్డి దారిలో, మామాకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడు. మన ముఖ్యమంత్రికి మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానం. ప్రజల కోసం నిత్యం శ్రమించే ముఖ్యమంత్రి జగన్‌ని తిరుపతి ఎన్నికల్లో ఆశీర్వదించండి' అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. 

చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం: మంత్రి అనిల్‌
'18 నెలలోనే మన ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. మేనిఫెస్టోలో 90 శాతం ఇప్పటికే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిది. ఇవాళ ప్రజల ఇంటి ముందే పాలన సాగుతోంది. సచివాలయాల ద్వారా అన్ని పనులు జరిగిపోతున్నాయి. తిరుపతి ఎన్నికలు ముఖ్యమంత్రి పనితీరుకి, గత ప్రభుత్వం అరాచకాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చెప్పవచ్చు.
 

తిరుపతి ఎంపీ ఉపఎన్నికలో 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాం. చంద్రబాబుని ఆ రాష్ట్రానికే పరిమితం చేద్దాం. ప్రతిపక్ష నాయకుడిగా తనకి ఇక్కడ పనిలేకనే.. బాబు పక్క రాష్ట్రంలో ఉండి పోయాడు. లోకేష్ ట్రాక్టర్‌ని ఉప్పుటేరులో పడేసినట్టే.. టీడీపీని కూడా సముద్రంలో ముంచడం ఖాయం. కోవిడ్ సాకు చూపి ముఖ్యమంత్రి ఏ పధకం కూడా ఆపలేదు. అన్ని పనులు చెప్పిన సమయానికి చేసి ముఖ్యమంత్రి గ్రేట్ లీడర్ అనిపించుకుంటున్నారు' అని మంత్రి అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

తిరుపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలి: గౌతమ్‌రెడ్డి
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళల, పేదల ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒట్టి ఎంవోయూల ప్రభుత్వం, మేము ఆచరణలో పారిశ్రామిక అభివృద్ధి చూపిస్తున్నాం. 18 నెలల్లోనే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామంటే మా ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధే కారణం. వచ్చే తిరుపతి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు.
 
బాబు విజన్‌ 2020 అనేవాడు.. 2020లో కరోనా వచ్చింది: కాకాణి
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మృతి పార్టీకి తీరనిలోటు. రేపు జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో అభ్యర్థి ఎవరైనా వైఎస్సార్‌సీపీ అఖండ మెజారిటీతో గెలిపించాలి. గతంలో చంద్రబాబు విజన్‌ 2020 అనేవాడు. అంటే 2020లో కరోనా వచ్చింది. మళ్లీ విజన్‌ 2029 అంటున్నాడు. అప్పుడేం విపత్తు వస్తుందో..?. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న టైంలో పనిచేయడం ఇష్టం లేకపోతే దొంగ సంతకం పెట్టేవాడు. మంచికో సంతకం, చెడుకో సంతకం పెట్టే కుటిల నీతి చంద్రబాబు నైజం. వచ్చే తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు రాకుండా చేయాలి. నామినేటెడ్‌ పదవుల్లో, కాంట్రాక్టుల్లో, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదే. నెల్లూరు జిల్లాలో ఒక బ్రూస్లీ ఉన్నాడు. ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. సోమిరెడ్డికి ఈ సారి సర్వేపల్లి వైపు కన్నెత్తి చూసే దమ్ములేదు అంటూ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. 

మరిన్ని వార్తలు