మైనింగ్‌ ఆదాయ లక్ష్యాన్ని సాధించాలి

29 Apr, 2021 04:37 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి, పక్కన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

గనుల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన 

సాక్షి, అమరావతి: మైనింగ్‌ ఆదాయ లక్ష్యాలను సాధించాలని అధికారులను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆదేశించారు. గనుల శాఖ అధికారులతో విజయవాడలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. గతేడాది కరోనా సంక్షోభ సమయంలో కూడా అధికారుల కృషి వల్ల రూ.2,917 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 81 శాతం ఆదాయాన్ని సాధించిపెట్టిన అధికారులను అభినందించారు. 2021–22లో రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని వారు అంచనా వేశారు. ఈ ఏడాది ఆదాయ లక్ష్యాలను చేరేందుకు తగిన కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఏపీకి వలస వచ్చిన వారు కరోనా భయంతో వెనక్కి వెళ్లిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని, తగిన వసతులు కల్పించాలని ఆదేశించారు.

అక్రమ మైనింగ్, అక్రమ రవాణాను అరికట్టాలని స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన తనిఖీల్లో అక్రమ మైనింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 10,736 కేసులు నమోదు  చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.42.66 కోట్ల జరిమానాలు విధించినట్టు వివరించారు. మూడంచెల విధానంలో మైనింగ్‌ ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని గనుల శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకట్‌రెడ్డి చెప్పారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని.. ఇతర జిల్లాల్లో త్వరలో ప్రవేశపెడతామన్నారు. అలాగే శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సీనరేజీ వసూళ్లను ప్రయోగాత్మకంగా అవుట్‌ సోర్సింగ్‌ విధానంలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు