నేడు పోలవరంపై కీలక భేటీ

9 Jun, 2021 05:21 IST|Sakshi

పనుల పురోగతిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి సమీక్ష

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై బుధవారం కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వర్చువల్‌ విధానంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో పాటు పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్‌ హెచ్‌కే హల్దార్, డీడీఆర్పీ చైర్మన్‌ ఏబీ పాండ్య తదితరులు పాల్గొంటారు. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో, వచ్చే సీజన్‌లో చేపట్టాల్సిన పనులు, గడవులోగా పూర్తి చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి సమీక్షించనున్నారు.

రెండోసారి సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు సమీక్షలో కోరనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో బకాయిపడిన రూ.1,600 కోట్లను తక్షణమే రీయింబర్స్‌ చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. నిర్వాసితులకు పురావాసం కల్పించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించనున్నారు.  

>
మరిన్ని వార్తలు