పోలవరంపై కీలక భేటీలు

17 May, 2022 03:43 IST|Sakshi

నేడు, రేపు పోలవరంపై కీలక భేటీలు

డిజైన్లపై నేడు కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం నేతృత్వంలో భేటీ

నిధుల మంజూరుపై రేపు ఆ శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ డిజైన్లు, నిధుల మంజూరుపై ఢిల్లీలో మంగళ, బుధవారాల్లో కేంద్ర జల్‌శక్తి శాఖ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గోదావరి వరద ఉధృతికి పోలవరం ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటం, కొంత భాగం దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను పటిష్ఠం చేయడంపై చర్చించేందుకు మంగళవారం కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులతోపాటు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి ఈ సమావేశంలో పాల్గొంటారు. దిగువ కాఫర్‌ డ్యామ్‌కు ఆరు కిలోమీటర్ల దిగువన పురుషోత్తపట్నం వద్ద గోదావరిలో ఇసుక తిన్నెల డ్రెడ్జింగ్‌ చేస్తూ.. అందులో నుంచి వచ్చే ఇసుకను ప్రత్యేక పైపులైను ద్వారా ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైనచోట పోసి.. వైబ్రో కాంపాక్షన్‌ చేయడం ద్వారా పూర్వస్థితికి తెచ్చే విధానాన్ని ఢిల్లీ ఐఐటీ రిటైర్డు డైరెక్టర్‌ వి.ఎస్‌.రాజు, ప్రొఫెసర్‌ రమణ ప్రతిపాదించారు. దీనిపై ఈనెల 11న సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ ఖయ్యూం అహ్మద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధ్యయనం చేసింది.

ఖయ్యూం అహ్మద్‌ బృందం నివేదిక ఆధారంగా కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానంపై వెదిరె శ్రీరాం నేతృత్వంలో జరిగే సమావేశం నిర్ణయం తీసుకోనుంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లకు పెట్టుబడి అనుమతి ఇవ్వడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 41.15 మీటర్ల కాంటూర్‌ వరకు ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి నిధుల మంజూరుపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ బుధవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా తొలిదశ పనుల పూర్తికి ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధుల మంజూరుపై ఈ సమావేశంలో చర్చిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు