యుద్ధప్రాతిపదికన పోలవరం పూర్తి

13 Apr, 2022 03:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అవసరమైన సహకారాన్ని సంపూర్ణంగా అందించాలని కేంద్ర ఆర్థిక, అటవీ, పర్యావరణ, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓలను కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు వేతనాలను వారి ఖాతాల్లో జమచేసిన తరహాలోనే పోలవరం నిర్వాసితులకూ సహాయ, పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీ కింద చెల్లించాల్సిన పరిహారాన్ని నగదు బదిలీ రూపం (డీబీటీ)లో వారి ఖాతాల్లో జమచేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు.

కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన 2014, మే 28న ఏర్పాటైన పీపీఏ పాలక మండలి  తొలి సమావేశాన్ని మంగళవారం వర్చువల్‌గా పంకజ్‌కుమార్‌ నిర్వహించారు. ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ తరఫున రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి, తెలంగాణ సీఎస్‌ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్‌సీ మురళీధర్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పీపీఏ సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్‌ వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై పాలక మండలి సంతృప్తి వ్యక్తంచేసింది. 

పీపీఏ సీఈఓ వ్యాఖ్యపై అభ్యంతరం
పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం చోటుచేసుకోవడానికి ప్రధాన కారణం బడ్జెట్‌లో కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోకపోవడమేనని పీపీఏ సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పడంపై జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించడంలేదని గుర్తుచేశారు.  బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతోపాటు రీయింబర్స్‌మెంట్‌లో జాప్యం జరగకుండా చూడాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని పంకజ్‌ చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు తొలిదశలో నీటిని నిల్వచేయడానికి ఎలాంటి అభ్యంతరాల్లేవని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖాధికారులు చెప్పారు. కానీ, ఆగస్టులోగా తొలిదశలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని.. వాటికి నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారు. దీనిపై పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ.. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని డీబీటీ రూపంలో వారి ఖాతాల్లో జమచేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. 

పరిశీలిస్తాం
పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి అవసరమైన నిధులతోపాటు.. సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ ఆమోదించి, పెట్టుబడి అనుమతిచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కోరారు. రీయింబర్స్‌మెంట్‌లో జాప్యంలేకుండా చూసి.. ప్రాజెక్టు పనులకు నిధుల కొరత తలెత్తకుండా చూస్తామని పంకజ్‌కుమార్‌ స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు