ఉమ్మడి ప్రాజెక్టులతో మొదలు 

8 Oct, 2021 03:51 IST|Sakshi

తొలిదశలో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టులు కృష్ణాబోర్డు పరిధిలోకి 

ప్రస్తుతానికి పెద్దవాగు ప్రాజెక్టు మాత్రమే గోదావరి బోర్డు అధీనంలోకి 

10, 11 తేదీల్లో సబ్‌ కమిటీలు, 12న బోర్డుల సమావేశాలు 

రెండు రాష్ట్రాలకు స్పష్టత ఇచ్చి 14 నుంచి గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు 

కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తొలిదశలో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలు ముడిపడిన సాగు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు వెళ్లనున్నాయి. ఈనెల 14 నుంచి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు జలవిద్యుత్‌ కేంద్రాలు,  వాటిలో పనిచేసే సిబ్బంది, కార్యాలయాలు, వాహనాలు సహా అన్నీ కృష్ణా బోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించనుంది. గోదావరి పరీవాహక ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడిన పెద్దవాగు ప్రాజెక్టును మాత్రమే ప్రస్తుతానికి గోదావరి బోర్డు అధీనంలోకి తీసుకోనుంది. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్రాజెక్టులను బోర్డులు తమ పరిధిలోకి తీసుకోనున్నాయి.

ఈనెల 10, 11 తేదీల్లో కృష్ణా, గోదావరి బోర్డుల సబ్‌ కమిటీల సమావేశాలు నిర్వహించి, 12న రెండు బోర్డుల ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి.. రెండు రాష్ట్రాలకు స్పష్టత ఇవ్వాలని బోర్డుల చైర్మన్లకు కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సూచించారు. ఈనెల 14 నుంచి బోర్డుల పరి«ధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ జూలై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీచేసిన కేంద్రం.. ఈ నోటిఫికేషన్‌ అక్టోబర్‌ 14 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్‌ అమలు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో కేంద్ర జల్‌శక్తిశాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ సమావేశమయ్యారు. 

నోటిఫికేషన్‌ అమలు చేయాల్సిందే 
బోర్డుల పరిధిలో ఉండే ప్రాజెక్టులు, వాటి వివరాలు, రాష్ట్రాలు అందించిన సమాచారం, సిబ్బంది నియామకం, నిధుల చెల్లింపు, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత, రాష్ట్రాల అభ్యంతరాలు, ఇంతవరకు పూర్తిచేసిన చర్యలు తదితర వివరాల గురించి రెండు బోర్డుల చైర్మన్లను దేవశ్రీ ముఖర్జీ ఆరా తీశారు. ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవడానికి రెండు రాష్ట్రాల నుంచి అనేక అభ్యంతరాలున్నాయని బోర్డుల చైర్మన్లు వివరించారు. కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను కృష్ణాబోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం సూచిస్తోందని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని తెలంగాణ సర్కారు కోరుతోందన్నారు. దీనిపై దేవశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులతోపాటు వాటిపై ఆధారపడిన జలవిద్యుత్‌ కేంద్రాలను బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు.

గోదావరి బేసిన్‌లో ఒక్క పెద్దవాగు ప్రాజెక్టు కింద మాత్రమే రెండు రాష్ట్రాల ఆయకట్టు ఉందని గోదావరి బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పగా.. ఆ ప్రాజెక్టును తొలుత అధీనంలోకి తీసుకుని తర్వాత మిగతా ప్రాజెక్టులపై దృష్టిసారించాలని దేవశ్రీ ముఖర్జీ చెప్పారు. బోర్డు నిర్వహణకు సీడ్‌ మనీ కింద ఒక్కో బోర్డుకు ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్లు డిపాజిట్‌ చేయాలని, ఆ మేరకు ప్రభుత్వాలకు లేఖలు రాసి నిధులు డిపాజిట్‌ చేయించుకోవాలని బోర్డుల చైర్మన్లకు సూచించారు. ఈ నేపథ్యంలో 10వ తేదీ నుంచి వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు బోర్డుల చైర్మన్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఈనెల 12న నిర్వహించే ప్రత్యేక సమావేశంలో బోర్డు పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులు, జలవిద్యుత్‌ కేంద్రాలు, సిబ్బంది, కార్యాలయాలు తదితర వివరాలపై మరింత స్పష్టత వస్తుందని బోర్డుల అధికారవర్గాలు తెలిపాయి.   

మరిన్ని వార్తలు