ఒక్కగానొక్క కూతురు.. మృత్యువుతో పోరాడి ఓడింది

4 Dec, 2021 14:32 IST|Sakshi

చికిత్స పొందుతూ బాలిక మృతి  

సాక్షి,నందవరం( కర్నూలు): మండల కేంద్రమైన నందవరానికి చెందిన బుట్టా కల్యాణి(17) శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందినా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నందవరం గ్రామానికి చెందిన బుట్టా శేఖర్, శోభల ఏకైక కుతూరు బుట్టా కల్యాణి గత కొన్ని నెలలుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోంది. ఆమె నందవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది పదో తరగతి పూర్తి చేసింది.

అయితే శ్వాసకోశ వ్యాధి చికిత్సకు రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో దాతలను సంప్రదించారు. వారి సహకారంతో కొన్ని నెలలు ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసి ఆక్సిజన్‌ అందించారు. వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అందిస్తామని చెప్పడంతో గత సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆరోగ్య శ్రీ పథకం ద్వారా డిసెంబర్‌ 1వ తేదీన బాలికకు ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ పూర్తి చేశారు. అనంతరం ఐసీయూలో ఉంచారు. శుక్రవారం తెల్లవారుజామున కల్యాణి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏకైక కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

చదవండి: డ్రైవింగ్‌ చేసేందుకు డోర్‌ వద్దకు వెళ్లి నిల్చున్నాడు.. బస్సు తలుపు ఊడి..

మరిన్ని వార్తలు