ఆంధ్రా ఊటీకి అద్దాల బోగీలు

13 Oct, 2021 04:15 IST|Sakshi
అరకు లోయకు చేరుకున్న ట్రయల్‌ రన్‌ అద్దాల బోగీ

అరకు అందాల్ని వీక్షించేందుకు విస్టో డోమ్‌

ట్రయల్‌ రన్‌ నిర్వహించిన రైల్వే శాఖ

అరకు లోయ: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయకు వచ్చే పర్యాటకుల కోసం రైల్వేశాఖ మరో రెండు అద్దాల బోగీలను అందుబాటులోకి తెస్తోంది. విశాఖ నుంచి అరకు లోయకు నడిచే రెగ్యులర్‌ ట్రైన్‌కు వీటిని జత చేసేందుకు  రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఒక అద్దాల రైలు బోగీ ఉన్నప్పటికీ పర్యాటకుల నుంచి ఈ సీజన్‌లో  డిమాండ్‌ పెరిగింది.  దీంతో అరకు ట్రైన్‌కు అదనంగా రెండు విస్టోడోమ్‌ అద్దాల బోగీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ గొడ్డేటి మాధవి, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.

గత ఏడాదే అదనంగా రెండు అద్దాల బోగీలు నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినప్పటికీ కోవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీలను మంగళవారం రైల్వే శాఖ అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. విశాఖ నుంచి అరకు లోయ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఈ రెండు అద్దాల బోగీలు పర్యాటకులు, స్థానికులను ఆకర్షించాయి. వీటిలో  రైల్వే ఏడీఆర్‌ఎం ఎస్‌కే గుప్తా, ఇతర అధికారులు ప్రయాణించారు. త్వరలో అందుబాటులోకి రానున్న రెండు అద్దాల బోగీల్లో 44 సీట్లతో పాటు, పూర్తిస్థాయిలో సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని రైల్వే ఏడీఆర్‌ఎం ఎస్‌కే గుప్తా తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఉన్న విస్టో డోమ్‌ బోగీ కన్నా ఈ రెండు బోగీల్లో మరిన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. 

మరిన్ని వార్తలు