ఇటు తెలుగు.. అటు ఇంగ్లిష్‌

28 Aug, 2020 07:01 IST|Sakshi

ప్రాథమిక విద్యలో తొలిసారిగా ‘మిర్రర్‌ ఇమేజ్‌’ పాఠ్య పుస్తకాలు

పేజీకి అటూ ఇటూ ఇంగ్లిష్, తెలుగులో ముద్రణ

తెలుగు నుంచి ఇంగ్లిష్‌ మాధ్యమానికి మార్పుసరళంగా జరిగేందుకు ప్రభుత్వం చర్యలు

సెమిస్టర్‌ విధానం ప్రాథమిక విద్యలో ఇదే మొదటిసారి

తెలుగు, ఇంగ్లిష్, గణితంలో 1–6వ తరగతి వరకు మార్పులు

ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు తొలిసారిగా వర్క్‌ బుక్స్‌

సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు పలు సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు మాతృభాషతోపాటు అటు ఆంగ్లభాషలోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహిస్తూ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ మార్పు ప్రక్రియ సరళంగా జరిగేందుకు ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎలిమెంటరీ స్థాయిలో ’మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్య పుస్తకాలు’ అందించేందుకు సిద్ధమైంది. రెండు మాధ్యమాల్లో పాఠ్యాంశాలు ఉండటం ద్వారా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బోధన సులభం కానుంది. ఇప్పటికే మనబడి నాడు–నేడు ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దిన పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సిలబస్‌ను మార్చింది. విద్యార్థులకు సులభంగా ఉండేలా విద్యారంగ నిపుణులతో సరికొత్తగా పాఠ్యాంశాలను రూపొందించింది.  ఈ పుస్తకాలను సరికొత్తగా మిర్రర్‌ ఇమేజ్‌ తరహాలో ఒక పేజీలో తెలుగు, ఎదుటి పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలుండేలా రూపొందించారు.

రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ నిపుణుల సహకారంతో తెలుగు–ఇంగ్లిష్‌ భాషల్లో తొలిసారిగా రూపొందించిన మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్య పుస్తకాలను ఈ ఏడాది నుంచి విద్యార్థులకు అందించనున్నారు.
ఒకటి నుంచి ఆరో తరగతి వరకు తెలుగు,ఇంగ్లీష్, గణితం సిలబస్‌లో మార్పులు చేశారు.
ఈవీఎస్‌ (ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్‌) ఇకపై  3వ తరగతి నుంచి ఉండేలా సిలబస్‌ రూపకల్పన.
ఆరో తరగతిలో సోషల్, హిందీ పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు.
ఈఏడాది తొలిసారిగా ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థులకు వర్క్‌ బుక్స్‌ అందించనున్నారు.
గతంలో కేవలం 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను  పాఠ్యాంశాలుగా చేర్చారు. 
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్‌ విద్యా విధానం అమలులోకి తెస్తున్నారు. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందచేస్తారు. దీనివల్ల పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది. 

ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా..
‘రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసింది. నూతన పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. తెలుగు పాఠ్యాంశాలకు సంబంధించి 116 మంది కవుల రచనల నుంచి అంశాలను చేర్చాం. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఉన్నత ఆలోచనలతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ విద్యావ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్‌ బుక్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌ కూడా ఇస్తున్నాం. ప్రాథమిక విద్య చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్‌ విధానాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం’
    – డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు