ఒకవైపు ఆంగ్లం.. మరోవైపు తెలుగు

8 Oct, 2020 05:02 IST|Sakshi
ఇంగ్లిష్, తెలుగు భాషల్లో రూపొందించిన మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్యపుçస్తకం

విద్యార్థులకు తొలిసారిగా మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్యపుస్తకాలు

తెలుగు–ఇంగ్లిష్‌ భాషల్లో పేజీకి అటు ఇటు ముద్రణ

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా సిలబస్‌

తెలుగు పాఠ్యాంశాలు మరింత పరిపుష్టం

గతంలో 25 మందికి మించని తెలుగు కవుల సంఖ్య ఈసారి 116కు పెంపు

సాక్షి, అమరావతి: విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలకు వీలుగా అనేక సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచి సిలబస్‌ను మార్పు చేయడంతోపాటు పాఠ్యపుస్తకాలను సైతం వినూత్నంగా తీర్చిదిద్దింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరైన నేపథ్యంలో దాన్ని పిల్లలకు నేర్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంగ్లం/తెలుగు మాధ్యమాలు కోరుకునేవారికి రెండు మాధ్యమాలు ఒకే పాఠ్యపుస్తకంలో ఉండేలా ‘మిర్రర్‌ ఇమేజ్‌’ పాఠ్యపుస్తకాలను రూపొందించింది.

అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఆంగ్ల పాఠాలు
అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఆంగ్ల మాధ్యమ పాఠాల సిలబస్‌ రూపకల్పనకు ప్రత్యేక ప్రాజెక్టు అధికారిగా ఐఏఎస్‌ అధికారిణి వెట్రిసెల్విని నియమించారు. ఇతర రాష్ట్రాలతోపాటు సింగపూర్, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాల సిలబస్‌తోనూ తులనాత్మక పరిశీలన చేశారు. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా యూనివర్సిటీకి చెందిన విద్యావేత్త మాయా గుణవర్థన నేతృత్వంలో నిపుణుల బందాన్ని, మైసూరులోని రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్, హైదరాబాద్‌లోని ఇఫ్లూలను పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వాములుగా చేశారు. పాఠ్యాంశాలకనుగుణంగా బొమ్మలు, అందమైన లేఔట్‌ డిజైన్లను రూపొందించారు. సులువుగా అర్థమయ్యేలా పేజీకి ఒకవైపు ఆంగ్లం, రెండోవైపు తెలుగులో ఉండేలా పుస్తకాలు సిద్ధం చేయించారు.

సిలబస్‌లో అనేక మార్పులు
1 నుంచి 6వ తరగతి వరకు ఆయా సబ్జెక్టుల సిలబస్‌లో మార్పులు చేశారు. ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ ఇకపై మూడో తరగతి నుంచే ఉంటుంది. తొలిసారిగా ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు వర్క్‌బుక్స్‌ను అందించనున్నారు. తెలుగులో గతంలో 25 మంది కవుల రచనలే ఉండగా ఈసారి అన్ని ప్రాంతాలు, అన్ని మాండలికాలు, సంస్కృతులకు పెద్దపీట వేస్తూ 116 మందికిపైగా కవుల రచనలను పాఠ్యంశాలుగా తీసుకోవడం విశేషం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నిటిలోనూ తెలు
గును తప్పనిసరిగా అభ్యసించాల్సి ఉంటుంది. తెలుగు భాషా సామర్థ్యాలను పెంచుకోవడం, భాషా సౌందర్యాన్ని తెలుసుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందాయి.

సెమిస్టర్‌ విధానంలో పాఠ్యపుస్తకాలు
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పాఠశాల స్థాయి నుంచే సెమిస్టర్‌ విధానం పెట్టి పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందిస్తాం. దీనివల్ల పాఠ్యపుస్తకాల బరువు చాలా తగ్గుతుంది. విద్యార్థులు ఏయే సెమిస్టర్లలో ఏమేరకు రాణిస్తున్నారు? ఎక్కడ వెనుకబడి ఉన్నారో సులభంగా అంచనా వేయొచ్చు. మిర్రర్‌ ఇమేజ్‌ పాఠ్యపుస్తకాల వల్ల టీచర్లకు, విద్యార్థులకు బోధనాభ్యసనం సులువుగా ఉంటుంది. 
– డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ

ఇష్టంగా చదువుకునేలా పాఠాలున్నాయి..
గతంలో పాఠాలు చెప్పి అభ్యాసాల్లోని వ్యాకరణం, ఇతర ప్రక్రియలను విద్యార్థులతో చేయించేవారు. ఇప్పుడు కృత్యాధారిత అభ్యసనం ద్వారా నేర్చుకోనున్నారు. పాఠాల వెనుక ప్రశ్నలు, జవాబులు, అభ్యాసాలు ఉండవు. అవన్నీ పాఠంలో అంతర్భాగంగానే ఉంటాయి. ఇష్టంగా చదువుకునేలా ప్రస్తుత పాఠ్యాంశాలున్నాయి.
– డాక్టర్‌ డి.చంద్రశేఖరరెడ్డి, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి

అన్ని మాండలికాలకు పెద్దపీట
తెలుగు భాషను మరింత పరిపుష్టం చేసే దిశగా ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 1 నుంచి 6వ తరగతి వరకు తెలుగు భాషా సంస్కృతి, సంప్రదాయాల మేలు కలయికతో పాఠ్యాంశాలు రూపుదిద్దుకున్నాయి. అన్ని ప్రాంతాల మాండలికాలు, అన్ని కులాలు, మతాలకు సంబంధించిన అంశాలకూ పెద్దపీట వేశాం.
– డాక్టర్‌ కడిమెళ్ల వరప్రసాద్, పాఠ్యపుస్తక రూపకల్పనలో భాగస్వామి 

మరిన్ని వార్తలు