నేటి నుంచి సూర్యలంక తీరంలో మిస్సైల్‌ ఫైరింగ్

24 Nov, 2020 05:28 IST|Sakshi

ఆకాశమార్గం గుండా వచ్చే శత్రువులను ఎదుర్కోవడమే ఫైరింగ్‌ లక్ష్యం

డిసెంబర్‌ 2 వరకు ఫైరింగ్‌ నిర్వహణ

ఫైరింగ్‌కు అనుకూలంగా సూర్యలంక తీరం

బాపట్ల టౌన్‌:  గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని సూర్యలంక తీరంలో మంగళవారం నుంచి మిస్సైల్‌ ఫైరింగ్‌  ప్రారంభం కానుంది. డిసెంబర్‌ 2వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. భారతదేశంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లలో తీరప్రాంతానికి దగ్గరగా దట్టమైన అడవుల మధ్య ఫైరింగ్‌ చేసేందుకు అనుకూలంగా ఉండటంతో మిస్సైల్‌ ఫైరింగ్‌కు ఈ తీరాన్ని ఎన్నుకున్నారు. ఆకాశమార్గం గుండా దేశంలోకి చొరబడే శత్రు విమానాలను నింగిలోనే గుర్తించి ఆ విమానాలను వందల కిలోమీటర్ల దూరంలో ఉండగానే మట్టికరిపించడం ఈ మిస్సైల్‌ ఫైరింగ్‌ ముఖ్య ఉద్దేశం.  

ఫైరింగ్‌కు కేరాఫ్‌ 
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల్లో సహజసిద్ధమైన తీరంగా ఖ్యాతిని సొంతం చేసుకుంది సూర్యలంక తీరం. వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంలోనూ ప్రత్యేకత చాటుతోంది. త్రివేండ్రం కమాండ్‌ పరిధిలో ఉన్న వాటిలో ఫైరింగ్‌కు అనుకూలమైన స్టేషన్‌ సూర్యలంక ఒక్కటే. ఫైరింగ్‌ చేసే ప్రతిసారీ మిస్సైల్‌ తయారీకి ఉపయోగించే శకలాలు భూమ్మీద పడితే వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇనుప వస్తువులు, ఉక్కుసామగ్రి వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అయితే, సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సముద్రానికి ఆనుకుని ఉండటంతో మిస్సైల్‌ ఫైరింగ్‌ అనంతరం శకలాలు సముద్రంలో పడిపోతుంటాయి. దీంతో ఎవరికీ ఎలాంటి హాని వాటిల్లే అవకాశం లేదు. అందుకే దేశంలో ఉన్న అన్ని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లకంటే సూర్యలంక స్టేషన్‌ శిక్షణ రంగంలో ముందంజలో ఉంది. 

తీరప్రాంత గ్రామాల్లో హెచ్చరికలు జారీ  
సూర్యలంక సముద్ర తీరంలో మంగళవారం నుంచి డిసెంబర్‌ 2 వరకు జరిగే మిస్సైల్‌ ఫైరింగ్‌కు  ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్, రాష్ట్ర రెవెన్యూ, పోలీస్, మత్స్యశాఖాధికారులు తీరప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తం చేశారు. ఫైరింగ్‌ జరిగే ప్రాంతం నుంచి తీరం వెంబడి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ప్రజలు ఉండకూడదని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలకు ఫైరింగ్‌పై అవగాహన కల్పించారు.  

సూర్యలంకకు ప్రత్యేక స్థానం  
భారతదేశంలో మొత్తం 7 కమాండ్‌లు ఉన్నాయి. వాటిలో డబ్ల్యూఏసీ (వెస్ట్రన్‌ ఎయిర్‌ కమాండ్‌– ఢిల్లీ), సౌత్‌ ఎయిర్‌ కమాండ్‌ (త్రివేండ్రం), సౌత్‌ వెస్ట్‌ ఎయిర్‌ కమాండ్‌ (గుజరాత్‌), మెయింటెనెన్స్‌ కమాండ్‌ (నాగపూర్‌), సెంట్రల్‌ కమాండ్‌ (అలహాబాద్‌–యూపీ), ట్రైనింగ్‌ కమాండ్‌ (బెంగళూరు), అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ (పోర్ట్‌బ్లెయిర్‌)లో ప్రధానమైన కమాండ్‌లు ఉన్నాయి. ఒక్కో కమాండ్‌ పరిధిలో పదుల సంఖ్యలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లు ఉంటాయి. త్రివేండ్రంలో ఉన్న సౌత్‌ ఎయిర్‌ కమాండ్‌ (సదరన్‌ కమాండ్‌) పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన 15 ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ఏకైక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సూర్యలంక మాత్రమే.  

మరిన్ని వార్తలు