‘నవోదయ’ ప్రశ్నపత్రంలో తప్పులు

3 May, 2022 03:40 IST|Sakshi
ప్రశ్నపత్రంలో అనువాద, అన్వయ లోపాలు

నాలుగు మ్యాథ్స్‌ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాలు

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన 

కోడూరు: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్‌ 30న నిర్వహించిన పరీక్షలో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో నాలుగు మ్యాథ్స్‌ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మ్యాథ్స్‌ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నపత్రం ‘హెచ్‌’ కోడ్‌లో 48వ ప్రశ్న ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఏవి?’ అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఎన్ని’ అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు.  

47వ ప్రశ్న ‘ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని తప్పుగా ఇచ్చారు. అయితే.. ‘ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీసివేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న.. ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది’ అని ఉంది. ఇది ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది’ అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు.

నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ నాలుగు ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయపద్ర, కో–ఆర్డినేటర్‌ మన్నె ప్రేమ్‌చంద్‌ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు.

మరిన్ని వార్తలు