ముస్లిం మైనారిటీలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ 

8 Jun, 2022 06:09 IST|Sakshi
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని సన్మానిస్తున్న ముస్లిం మత పెద్దలు

మైనారిటీల ఆత్మీయ సదస్సులో లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్, ఎంపీ మిథున్‌రెడ్డి 

కలికిరి: రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లవేళలా అండగా ఉన్నారని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో మంగళవారం జరిగిన ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు నియోజకవర్గం మహల్‌కు చెందిన డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ఖాన్‌కు రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించడం సీఎం జగన్‌ ఘనత అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనారిటీలకు ఒక్క రాష్ట్రస్థాయి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ముస్లిం మైనారిటీ వర్గాలను ఓటు బ్యాంకుగా పరిగణించి వాడుకుని వదిలేశారని విమర్శించారు.

పక్క రాష్ట్రాల్లో హిజాబ్‌ సమస్య, మసీదుల్లో మైకుల నిషేధం, ముస్లింలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాలు గమనిస్తున్నామన్నారు. కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉండటంతో ముస్లింలకు సముచిత స్థానం, భద్రత ఉంటున్నాయని చెప్పారు.

ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఉన్నతాధికారులు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రాకి వస్తున్న పరిస్థితి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మూడు పార్టీలు ప్రజల ముందుకు వచ్చి తప్పుదోవ పట్టిస్తాయని, వారి అసత్యాలను నమ్మకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలవాలని ఆయనకోరారు.   

మరిన్ని వార్తలు