అఫ్గాన్‌ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం

27 Aug, 2021 04:24 IST|Sakshi

అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ

 సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌ విషయంలో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను రూపొందించాలని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావడంతోపాటు అక్కడ భారత్‌ పెట్టుబడులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌లో చాలామంది తెలుగు వారు పనిచేస్తున్నారని మిథున్‌రెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. తాలిబన్లతో చర్చలు జరిపి అందరినీ క్షేమంగా తీసుకురావాలన్నారు. తాను సూచించిన అంశాలను విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ నోట్‌ చేసుకున్నారని తెలిపారు. అఫ్గాన్‌ అంశంలో ఆచితూచి వ్యవహరిస్తామని చెప్పారన్నారు. కాగా, అఫ్గాన్‌లో ఇప్పటిదాకా భారత్‌ పెట్టిన 300 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో వివరించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. 

మరిన్ని వార్తలు