విశాఖ ఉక్కుపై పలుసార్లు ఒత్తిడి తెచ్చాం

9 Mar, 2021 02:55 IST|Sakshi

బీజేపీ భాగస్వామి పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారు?

వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి 

పోలవరానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తమదేనని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని పలుసార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు. సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దని వైఎస్సార్‌సీపీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ అంశాలపై పలుసార్లు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. సోమవారం నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ రాష్ట్ర సమస్యలతోపాటు, విశాఖ ఉక్కు, పోలవరంపై మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరామన్నారు.

విశాఖ ప్లాంటుపై కేంద్ర మంత్రుల్ని కలిసి పరిస్థితి వివరించామన్నారు. నష్టాలు వస్తే అమ్ముకోవచ్చు కానీ, లాభాలు వచ్చే అవకాశం ఉన్న ప్లాంటును అమ్మడం సరికాదన్నారు. విశాఖ ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి చెప్పారన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారన్నారు. పవన్‌ కల్యాణ్‌కు పార్లమెంటు ప్రొసీడింగ్స్‌ తెలియవేమోనని, కనీసం పత్రికలూ చదవరేమోనని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట్లాడిన అంశాలు పత్రికల్లో వచ్చాయన్నారు. నాలుగు రోజులు ఢిల్లీలో ఉండి బీజేపీ భాగస్వామి పవన్‌ ఏంచేశారో చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకొచ్చేబాధ్యత వైఎస్సార్‌సీపీ ఎంపీలపై ఉందని, తప్పకుండా తీసుకొస్తామని మిథున్‌రెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు