చంద్రబాబుకు శిక్ష తప్పదు

19 Mar, 2021 09:53 IST|Sakshi

సీఐడీ విచారణకు హాజరయ్యే ధైర్యం లేదా!

తప్పించుకునేందుకే చంద్రబాబు, నారాయణ స్టే కోసం ప్రయత్నాలు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి:  అమరావతిలో దళితులను దగా చేసిన మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు అసైన్డ్‌ భూ కుంభకోణం కేసులో శిక్ష తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. అసైన్డ్‌ భూముల వ్యవహారంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఎమ్మెల్యే ఆర్కే ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే నిమిత్తం సీఐడీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని ఆర్కేకు నోటీసులు పంపించగా.. గురువారం ఆయన విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చారు.

దాదాపు గంటన్నర పాటు సీఐడీ అధికారులు అడిగిన సమాచారం ఇచ్చి, ఆధారాలు సమర్పించిన అనంతరం మీడియాతో ఆర్కే మాట్లాడుతూ.. రాజధాని పేరుతో తమకు అన్యాయం జరిగిందని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ రైతులు ఆవేదన చెందడంతో వారికి న్యాయం చేసే నిమిత్తం తాను సీఐడీకి ఫిర్యాదు చేశానన్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాలకు పైగా దళితుల భూములను టీడీపీ పెద్దల బినామీలు లాక్కున్నారని, తాడికొండ నియోజకవర్గంలో మరో 3,500 ఎకరాల అసైన్డ్‌ భూములు గుంజుకున్నారని తెలిపారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు, అసైన్డ్‌ భూ కుంభకోణానికి సంబంధం లేదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులో గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారని, కోర్టుల పరిధిలో ఉన్న దాని గురించి తాను మాట్లాడబోనని చెప్పారు. అసైన్డ్‌ భూ కుంభకోణానికి పాల్పడేలా చంద్రబాబు తెచి్చన జీవో 41 వల్ల రెవెన్యూ చట్టాలు దెబ్బతింటాయని అప్పట్లో కొందరు ఐఏఎస్‌లు అభ్యంతరాలు తెలిపారని, వారు రాసిన నోట్‌ ఫైల్స్‌ (అభ్యంతరాలు)ను సీఐడీ అధికారులకు అందజేసినట్టు ఆర్కే చెప్పారు. ఈ కేసులో తన వద్ద ఉన్న పూర్తి సాక్ష్యాధారాలు సీఐడీకి సమరి్పంచానని, ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని చెప్పానన్నారు.   

మరిన్ని వార్తలు