టీడీపీ కార్యాలయానికి భూమి కేటాయింపు అక్రమం

28 Aug, 2020 07:16 IST|Sakshi

సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్‌

నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపట్టారు

సాక్షి, న్యూఢిల్లీ: గత ప్రభుత్వం గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం అక్రమంగా భూమి కేటాయించిందని, నిబంధనలు ఉల్లంఘిస్తూ జరిపిన ఆ కేటాయింపులపై తగిన చర్యలు తీసుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన 3 ఎకరాల 65 సెంట్ల భూమిని కేటాయిస్తూ 22.06.2017 నాటి జీవో నంబరు 228ని సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాది అల్లంకి రమేష్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 
పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు

మంగళగిరి మండలం ఆత్మకూరులోని సర్వే నంబర్లు 392/1, 392/3, 392/4, 392/8, 392/10 పరిధిలో టీడీపీ కార్యాలయం నిర్మాణం కోసం గత ప్రభుత్వం 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన కేటాయించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతించింది. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇదివరకే సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్దేశించిన చట్ట సూత్రాలకు విరుద్ధం. 
నీటి వనరులను, వాటితో సంబంధం ఉన్న భూములను కేటాయించడంపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించారు. 
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం–1994లోని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. 
భవన అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినందున తగిన చర్యలు తీసుకోవాలి. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు తగిన ఆదేశాలు జారీచేయాలి. 
చట్ట ప్రకారం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉందని హైకోర్టు చెప్పినప్పటికీ కూల్చివేతకు ఆదేశాలు ఇవ్వలేదు. 
లీజు, నిర్మాణం నిషేధమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకరించినా, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేయకుండా కేసును ముగించింది. 

మరిన్ని వార్తలు