విపత్తువల్లే మట్టికట్ట తెగింది

6 Dec, 2021 07:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రకృతి విపత్తువల్లే అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిందేగానీ మానవ తప్పిదంవల్ల కానేకాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టంచేశారు. గోదావరి పుష్కరాల్లో నాటి సీఎం చంద్రబాబు ప్రచార పిచ్చితో ఒకేసారి ప్రజలను వదిలేయడంవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించారని.. మానవ తప్పిదమంటే ఇదని చెప్పారు. రాయలసీమలో సహజంగా వరదలు రావని.. 140 ఏళ్ల తర్వాత కుంభవృష్టితో ఊహించని రీతిలో వరదలు ముంచెత్తడంవల్లే అన్నమయ్య, ఇతర ప్రాజెక్టులు తెగిపోయాయని కూడా కేంద్ర బృందం నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబైనా కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అయినా వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని హితవు పలికారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోవడంతో జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మానవ తప్పిదంగా చిత్రీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారని మండిపడ్డారు.

అసహనంలో కూరుకుపోయిన బాబు
వరద బాధితులను యుద్ధప్రాతిపదికన పునరావాస శిబిరాలకు తరలించి.. అన్ని విధాలా ఆదుకునేలా అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని అంబటి చెప్పారు. సొంతూళ్లకు వరద బాధితులను చేర్చాక క్షేత్రస్థాయిలోకి సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లి.. వారిని పరామర్శించి ధైర్యం చెప్పారన్నారు. కష్టకాలంలో తమను ఆదుకున్న సీఎం వైఎస్‌ జగన్‌పై వరద బాధితులు తమ ప్రేమను తెలియజేస్తే.. దాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. బాధితులు సీఎం జగన్‌పై తిరగబడితే రాక్షసానందం పొందాలని చూసిన చంద్రబాబు.. పరిస్థితులు తద్భిన్నంగా ఉండటంతో తీవ్ర అసహనంలో కూరుకుపోయారన్నారు. అందువల్లే ప్రజలకు బుద్ధిలేదంటూ చంద్రబాబు తిడుతున్నారని చెప్పారు. కష్టనష్టాల్లో తోడునీడగా ఉండి.. ఉదారంగా ఆదుకుని, అండగా నిలిచే సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రజలు ప్రేమగా పలకరిస్తారని.. కుట్రలు, కుతంత్రాలతో కీడు చేయాలని చూసే చంద్రబాబును చూస్తే ప్రజలకు మొట్టబుద్ధి అవుతుందన్నారు. గతంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో గుంటూరు, విజయవాడల్లో ప్రజలను ఇదే రీతిలో చంద్రబాబు తిడితే.. జనం తగిన రీతిలో బుద్ధిచెప్పారని అంబటి గుర్తుచేశారు.

చంద్రబాబును ‘ఎర్రగడ్డ’లో చేర్చాలి
ఒక వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు వెళ్లారని అంబటి రాంబాబు చెప్పారు. అనూహ్యంగా ముంచెత్తిన వరదవల్ల సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలను తెలుసుకోకుండా, తన భార్యను ఎవరూ దూషించకున్నా దూషించినట్లుగా వక్రీకరించి చెప్పుకున్నారన్నారు. వీటిని పరిశీలిస్తే చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదన్నది స్పష్టమవుతోందని.. తక్షణమే ఆయన్ని ఎర్రగడ్డ మెంటల్‌ ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఇక వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన కేంద్ర బృందం.. దేశంలో ఎక్కడాలేని రీతిలో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారని అధికారులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిందని గుర్తుచేశారు. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికను ఒక్కసారి పరిశీలించి ఆ తర్వాత మాట్లాడాలని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సూచించారు. 

ఓటీఎస్‌ అప్పుడెందుకు గుర్తుకురాలేదు?
ఇళ్లకు సంబంధించి పేదలకు ప్రయోజనం చేకూర్చే ఓటిఎస్‌ పథకం తీసుకొస్తే.. డబ్బులు కట్టొద్దని, తాను అధికారంలోకి వస్తే ఉచితంగా చేస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓటీఎస్‌ పథకం ఎందుకు గుర్తుకురాలేదని అంబటి ప్రశ్నించారు. పేదలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టంలేదని.. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు