‘పరిషత్‌ ఎన్నికల తీర్పుపై డివిజన్‌ బెంచ్‌కు ప్రభుత్వం’

22 May, 2021 10:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల పరిషత్‌ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు ఫైనల్‌ కాదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తీర్పు కాపీ వచ్చాక ఏమి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. గతంలో సింగిల్‌ బెంచ్‌ స్టే ఇస్తే డివిజన్‌ బెంచ్‌ ఎన్నికలు జరిపించిన విషయం మనం చూశాం అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తీర్పు కాపీ వచ్చాక ఆ తీర్పును సవాల్‌ చేస్తూ, డివిజన్‌ బెంచ్‌కు వెళ్లే అవకాశం కూడా ఉందన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తప్పా ఒప్పా అనేది పక్కన పెడితే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తరువాత ఏ న్యాయ వ్యవస్థ కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదని గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్‌ అనేకం ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. డివిజన్‌ బెంచ్‌ ఇచ్చే తీర్పునుబట్టి సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఒక బెంచ్‌కు మరో బెంచ్‌కు మధ్య అభిప్రాయాలు మారుతూ ఉంటాయని చెప్పారు. ఈ విషయం ఫైనల్‌ అయ్యే వరకు టీడీపీ, జనసేనలు తమ తమ పద్ధతుల్లో వాదనలు చేస్తూనే ఉంటారన్నారు. ఏదేమైనా తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.

చదవండి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలు యథాతథం  
పరిషత్‌ ఎన్నికలు మళ్లీ పెట్టండి

మరిన్ని వార్తలు