ఆ లేఖకు, సీఎంకు ఎలాంటి సంబంధం లేదు

31 Aug, 2020 09:01 IST|Sakshi

బీజేపీ నేత సునీల్‌ దియోధర్‌కు ఎమ్మెల్యే భూమన లేఖ 

సాక్షి ప్రతినిధి, తిరుపతి/తిరుపతి తుడా: ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు అపార గౌరవం, ప్రేమాభిమానాలు ఉన్నాయని, ఆయన మనందరి నాయకుడని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. విరసం నేత వరవరరావుతో తనకున్న వ్యక్తిగత పరిచయంతోనే ఆయనను విడిచిపెట్టాలని తాను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశానని తెలిపారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు. తాను రాసిన ఆ లేఖను బీజేపీ నేత సునీల్‌ దియోధర్‌ ట్విటర్‌లో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌కు ముడిపెట్టి ప్రస్తావించడం బాధ కలిగించడంతోపాటు నవ్వు తెప్పించిందన్నారు. ఈ మేరకు భూమన ఆదివారం సునీల్‌ దియోధర్‌కు లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా.. 

భారత ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం ఏమాత్రం కాదు. నా లేఖలో నేను ఉపరాష్ట్రపతిని కోరింది.. అనారోగ్యంతో ఉన్న 81 ఏళ్ల వృద్ధుడు (వరవరరావు) పట్ల జాలి చూపాలని మాత్రమే. అంతేగానీ ఆయన భావజాలాన్ని అంగీకరించి కాదు. ఇది తప్పని మీకు (సునీల్‌ దియోధర్‌) అనిపిస్తే నమస్కారం పెట్టడం తప్ప మరేమీ చేయలేను. నేరస్తులు, హంతకులను నేనెప్పుడూ సమర్థించను. సాయుధ పోరాటం పట్ల, హింసే ఆయుధంగా ఉన్నవారి పట్ల నాకు ఎలాంటి సుముఖత లేదు.

46 ఏళ్ల క్రితం వరవరరావు, నేను, వెంకయ్య నాయుడు జైలులో కలిసి ఉన్నాం కాబట్టి నేను ఉపరాష్ట్రపతికి వ్యక్తిగతంగా లేఖ రాశాను. నా రాజకీయ ప్రస్థానం 1969–70లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతోనే ప్రారంభమైంది. 

శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నేను నమ్ముతాను. ఆ పై ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.   

భూమన ఆరోగ్యంపై సీఎం ఆరా 
కరోనా బారినపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భూమన కరుణాకర్‌రెడ్డిని ఆదివారం సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని సీఎంకు భూమన వివరించారు. ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడం ఆదర్శనీయమని సీఎం అభినందించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు.   

మరిన్ని వార్తలు