కోవిడ్‌ రోగులకు కదిరి ఎమ్మెల్యే వైద్యం

6 Aug, 2020 07:10 IST|Sakshi
కోవిడ్‌ పేషంట్‌ను పరీక్షిస్తున్న కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి

రోగులను ప్రేమగా పలకరిస్తూ పరీక్షలు చేసిన సిద్దారెడ్డి 

కదిరి: కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి కోవిడ్‌ పాజిటివ్‌ పేషంట్లకు వైద్యం అందించారు. ఆయన ఎమ్మెల్యే అయినప్పటికీ వృత్తిరీత్యా వైద్యుడు. బుధవారం ఆయన కదిరి మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించారు. మొదట అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడి పేషంట్లకు ఏఏ మందులు అందిస్తున్నారో, ఏఏ పరీక్షలు నిర్వహిస్తున్నారో ఆరా తీశారు. తర్వాత ఆయనే స్వయంగా పీపీఈ కిట్‌ ధరించి ఒక డాక్టర్‌తో పాటు మరో ఇద్దరు నర్సులను వెంటబెట్టుకొని నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న వార్డుల్లోకి వెళ్లారు.

అక్కడ మొత్తం 82 మంది పేషంట్లు ఉన్నారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరిస్తూ వారికి అన్ని పరీక్షలు నిర్వహించారు. ఇరువురు పేషంట్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి వారిరువురినీ వెంటనే స్థానిక కోవిడ్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. అక్కడ భోజన సౌకర్యాలపై కూడా ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రతిరోజూ చికెన్‌ బిర్యానీతో పాటు ఇమ్యూనిటీని పెంచేందుకు డ్రైప్రూట్స్‌ అందిస్తున్నారని, ఇక్కడ చాలా బాగుందని సంతోషం వెలిబుచ్చారు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని వారందరికీ ఎమ్మెల్యే ధ్యైర్యం చెప్పారు. ఎమ్మెల్యే వెంట తహసిల్దార్‌ మారుతి, వైద్యులు మున్వర్, ఐనుద్దీన్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు