యాప్‌తో దశ‘దిశ’లా రక్షణ...

30 Jul, 2021 08:09 IST|Sakshi

విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ 

పెనమకూరులో దిశ యాప్‌పై అవగాహన సదస్సు 

భారీగా హాజరైన మహిళలు 

తోట్లవల్లూరు(పామర్రు): మహిళల భద్రతే లక్ష్యంగా దిశ యాప్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిందని, దీనిని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు అన్నారు. మండలంలోని పెనమకూరు జెడ్పీ పాఠశాలలో దిశ యాప్‌పై అవగాహన సదస్సు గురువారం సాయంత్రం జరిగింది. ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్‌ రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని శ్రీనివాసులు తెలియజేశారు. మహిళలు, విద్యార్థినులు, యువతులు దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. ఒంటరిగా ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు ట్రాక్‌ మై రూట్‌ ఆప్షన్‌ వినియోగించుకుంటే, వారు వెళ్లే రూట్‌ను ట్రాక్‌ చేస్తామన్నారు. సరైన రూట్‌లో ఆ వాహనం వెళ్లనట్లయితే వెంటనే సంబంధిత ప్రాంతపు పోలీసులను అప్రమత్తం చేస్తామన్నారు. అలాగే ఈవ్‌టీజింగ్, వేధింపులతోపాటు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మొబైల్‌ ఫోన్‌ను మూడు సార్లు కదిపితే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆదుకుంటారని శ్రీనివాసులు వివరించారు. ఒంటరిగా ఉండే వృద్దులు సైతం ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని ఆయన అన్నారు.  

అక్క, చెల్లెమ్మల భద్రతే సీఎం లక్ష్యం.. 
రాష్ట్రంలో ప్రతి అక్క, చెల్లెమ్మ భద్రతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతిహామీని సీఎం గడచిన రెండేళ్లలో చిత్తశుద్ధితో అమలు చేశారని చెప్పారు. దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, అవగాహన సదస్సుకు తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల నుంచి మహిళలు భారీగా రావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దిశ యాప్‌ డౌన్‌లోడ్, ఉపయోగాల గురించి మహిళా పోలీసు అధికారులు వివరించారు. సర్పంచి నందేటి గంగాభవాని, డీసీపీ హర్షవర్ధన్‌రాజు, డీసీపీ(అడ్మిన్‌) మేరీ ప్రశాంతి, ఏడీసీపీ రామకృష్ణరాజు, తహసీల్దార్‌ కట్టా వెంకటశివయ్య, ఎంపీడీఓలు తుంగల స్వర్ణలత, నాంచారరావు, ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ఎస్‌ఐ వై. అర్జున్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు