తోడేరు పెద్దాయన ఇకలేరు..

8 May, 2021 11:37 IST|Sakshi
తండ్రి పార్దివ దేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్‌రెడ్డి (ఇన్‌సెట్‌లో) కాకాణి రమణారెడ్డి (ఫైల్‌)

పొదలకూరు: జిల్లాలో తనదైన ముద్రవేసుకుని ఆరు దశాబ్దాల పాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తండ్రి కాకాణి రమణారెడ్డి (90) శుక్రవారం అస్తమించారు. మండలంలోని తోడేరు నుంచే రమణారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆనం కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఏసీ సుబ్బారెడ్డి ప్రియశిష్యుడిగా, పుత్రసమానుడిగా కాకాణి రమణారెడ్డి జిల్లా రాజకీయా ల్లో వెలుగొందారు.

పొదలకూరు సమితి అధ్యక్షుడిగా ఏకధాటిగా పద్దెనిమిదేళ్లు కొనసాగి చరిత్ర సృష్టించారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరుగా హూందా రాజకీయాలు కొనసాగించారు. సమితి అధ్యక్షుడిగా వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి వారి కుటుంబాలకు అండగా నిలిచారు. 1953లో 22 ఏళ్ల ప్రాయంలో తోడేరు పంచాయతీ సర్పంచ్‌గా విజయం సాధించిన రమణారెడ్డి క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టా రు. ఎవరి అండదండలు లేకుండానే ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆనం కుటుంబం దృష్టిలో పడ్డారు. అనంతరం 1959 సమితి అధ్యక్షుడిగా ఎన్నికై 1977 వరకు కొనసాగారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన ల్యాండ్‌ సీలింగ్‌ పథకంలో ముందుగా రమణారెడ్డే తన 50 ఎకరాల మెట్ట, 10 ఎకరాల మాగాణి ప్రభుత్వానికి అప్పగించి ఆదర్శంగా నిలిచారు. చిన్నతనం నుంచే అభ్యుదయ భావాలు కలిగి పేదలను అక్కున చేర్చుకోవడంలో రమణారెడ్డి ముందుండేవారు.

ప్రముఖుల నివాళి 
తోడేరులో కాకాణి రమణారెడ్డి పార్దివ దేహం వద్ద రాజకీయ ప్రముఖులు నివాళులరి్పంచారు. తిరుపతి ఎంపీ  డాక్టర్‌ ఎం.గురుమూర్తి, వెంకటగిరి, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి రమణారెడ్డి గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఎన్‌డీసీసీ మాజీ చైర్మన్‌ వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి రమణారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాకాణి రమణారెడ్డి మృతికి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కాకాణి రమణారెడ్డికి సంతాపం తెలిపారు. రమణారెడ్డి సేవలను కొనియాడారు. కాకాణి రమణారెడ్డి భౌతిక కాయాన్ని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు.

సీనియర్‌ నేతను కోల్పోయాం: మంత్రి మేకపాటి సంతాపం 
ఆత్మకూరు: జిల్లాలోనే సీనియర్‌ రాజకీయ నాయ కులు, పొదలకూరు మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని, సీనియర్‌ నాయకుడిని కోల్పోవడం బాధగా ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ తరం రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయం చేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం, సమితి అధ్యక్షుడిగా పేదల అభ్యున్నతిగా కృషి చేసిన కాకాణి రమణారెడ్డి మృతి తీరని లోటు అన్నారు.

చదవండి: సున్నపురాయి గనుల్లో పేలుడు: ఐదుగురు మృతి
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

మరిన్ని వార్తలు