‘ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర’

14 Jul, 2021 16:40 IST|Sakshi

ఎమ్మెల్యే కిలారి రోశయ్య

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా టీడీపీ ఆరోపణలు చేస్తోందని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మండిపడ్డారు. ఆయన బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించాలని టీడీపీ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకుల వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. 41వేల కోట్ల పద్దుల గురించి ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారని, మళ్లీ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మొదటికి వచ్చారని మండిపడ్డారు.

టీడీపీ నేతలకు వారి నాయకుడు చంద్రబాబుకు నిజాలు మాట్లాడే అలవాటే లేదన్నారు. టీడీపీ వాళ్లు చెప్పిన పద్దుల్లో ఏజీ ఆఫీస్‌కి వివరణ ఇచ్చామని తెలిపారు. ఇదంతా చంద్రబాబు పెట్టిన సీఎఫ్‌ఎంఎస్‌ వల్లే సమస్య వచ్చిందన్నారు. చంద్రబాబు ఇలాంటి టెక్నాలజీ పేరుతో అనేక అక్రమాలు చేశారని మండిపడ్డారు. అవి ఫైబర్నెట్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో బయట పడుతున్నాయని చెప్పారు. అసలు సీఎఫ్‌ఎంఎస్‌ను ఒక ప్రైవేట్‌ వ్యక్తికి అప్పజెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
 

మరిన్ని వార్తలు