మాజీ మంత్రి బాలినేని మచ్చలేని నాయకుడు: శ్రీధర్‌రెడ్డి

29 Jun, 2022 19:48 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: ప్రకాశం జిల్లాలో మాజీమంత్రి, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతున్నారని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ..  ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి పర్యాయ పదం బాలినేని అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రతిష్టపాలు చేస్తే మంత్రి పదవిని సైతం త్యజించి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారని వివరించారు.

నైతిక విలువలతో కూడిన రాజకీయం చేశారని, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు అనైతిక ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా సొంత పార్టీ నేతులు ఎవరూ ప్రయత్నించకూడదని హితవు పలికారు. మాజీమంత్రి బాలినేని ఎదుర్కొంటున్న సమస్యలను తాను కూడా చవిచూస్తున్నట్లు వెల్లడించారు.

చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు)

వైఎస్సార్‌సీపీ పెట్టక మునుపు నుంచి పార్టీ కోసం కష్టం చేసిన వ్యక్తుల్లో తాను ఒక్కడేనని వివరించారు. మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలిచి సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూడాలనే తపన ఉండాలని, కానీ కొంత మంది ముఖ్య నేతలు రూరల్‌ నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని నేతలు తనను బలహీన పర్చాలని చూస్తున్నారని వెల్లడించారు. రూరల్‌ ప్రజానీకం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ బలహీన పర్చలేరని స్పష్టం చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ను తాను ఒకప్పటి రాజకీయ సహచరుడిగానే చూస్తున్నానని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయ ప్రత్యర్థిగా, రాజకీయ పోటీదారుడిగా చూడలేదని వివరించారు.   

చదవండి: (మా నాయకుడన్న ఆ మాటకు మేమంతా కట్టుబడి ఉన్నాం: కొడాలి నాని) 

మరిన్ని వార్తలు