Nellore Sewage Canal Issue: మురుగునీటి కాలువలో దిగి ఎమ్మెల్యే కోటంరెడ్డి  నిరసన

6 Jul, 2022 09:22 IST|Sakshi
మురుగు కాలువలో దిగి నిరసన తెలియజేస్తున్న  ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

సాక్షి, నెల్లూరు: అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే సమస్యలపై పోరాటం సాగిస్తామని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్‌లోని 21వ డివిజన్‌ ఉమ్మారెడ్డిగుంటలో గత ఎంతో కాలంగా ఉన్న మురుగు నీటి కాలువ సమస్యపై ఆయన మంగళవారం తీవ్రస్థాయిలో స్పందించారు. నగరపాలక సంస్థ, రైల్యే అధికారుల నిర్లక్ష్యానికి స్థానిక ప్రజలు పడుతున్న మురికి నీటి కష్టాలకు ఆయన చలించిపోయారు.

మురుగు కాలువలోకి దిగి సమస్య పరిష్కారమయ్యే వరకు తాను అక్కడే ఉంటానని బైఠాయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూరల్‌ రోడ్ల పునరుద్ధరణకు రూ.62 కోట్లు మంజూరు చేశారని, కానీ ఈ ప్రాంతంలో మురికి కాలువ సమస్యపై మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయా శాఖల అధికారుల్లో స్పందన కరువైందన్నారు. నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేకి హామీ ఇవ్వడంతో ఆయన కాలువలో నుంచి బయటకు వచ్చారు.

ఈ నెల 15వ తేదీ కాలువ నిర్మాణ పనులు చేపట్టి నెలలోపు పనులు పూర్తి చేస్తామని కార్పొరేషన్‌ అధికారులు చెప్పారు. 25వ తేదీ లోపు తాము కూడా పనులు పూర్తి చేస్తామని రైల్వే శాఖ అదికారులు హమీ ఇచ్చారు. సమస్యకు ఓ పరిష్కారం దొరకడంతో స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

 చదవండి: (CM YS JAGAN: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు