గడప గడపకు మన ప్రభుత్వం: ఎమ్మెల్యే రాచమల్లు దాతృత్వం

26 Aug, 2022 12:47 IST|Sakshi

ప్రొద్దుటూరు (వైఎస్సార్‌ జిల్లా): విద్యావంతురాలైన దివ్యాంగురాలు ముత్యాల లక్ష్మికి కృత్రిమ కాలును ఏర్పాటు చేసుకునేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం రూ.2.5 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం  33వ వార్డు పరిధిలోని ఆర్ట్స్‌కాలేజి రోడ్డులో తిరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేకు దివ్యాంగురాలి సమస్య ఎదురైంది. ఎంఎస్సీ (మ్యాథ్స్‌) చదివిన ముత్యాల లక్ష్మి ప్రస్తుతం 35వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పనిచేస్తోంది. 

ఇటీవల ఎడమ కాలికి ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ చేసి కాలిని పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఇంటి వద్దే ఉంది. ఆమె ఆత్మ స్థైర్యాన్ని గమనించిన ఎమ్మెల్యే రాచమల్లు కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తే లక్ష్మి జీవన పరిస్థితి పూర్తి మెరుగ్గా ఉంటుందని భావించి ఈ సహాయం అందించారు. ఈ సందర్భంగా దివ్యాంగురాలు లక్ష్మి మాట్లాడుతూ  పెద్ద మనసుతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తనకు సహాయం అందించారన్నారు. తాను ఎమ్మెల్యే ఇచ్చిన రూ.2.5 లక్షలతోపాటు మరో లక్ష కలిపి కృత్రిమ కాలు ఏర్పాటు చేసుకుంటానని తెలిపారు.  

నాలుగో వార్డు కౌన్సిలర్‌ వరికూటి ఓబుళరెడ్డి రూ.20 వేలు, పదో వార్డు కౌన్సిలర్‌ గరిశపాటి లక్ష్మీదేవి రూ.15 వేలు దివ్యాంగురాలికి ఆర్థిక సహాయం అందించారు. 
 
కార్యక్రమంలో పద్మశాలీయ సేవా సంఘం పట్టణాధ్యక్షుడు అగ్గారపు శ్రీనివాసులు, మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చౌడం రవీంద్ర, నాయకులు మల్లికార్జున ప్రసాద్, గజ్జల కళావతి, గుమ్మళ్ల పద్మావతి, జాకీర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు