ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ను బెదిరించిందెవరు ?

5 Jul, 2021 13:03 IST|Sakshi
వైఎస్సార్‌ జగనన్న కాలనీలో ఇంటి ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాచమల్లుతో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌  

జోరుగా విషప్రచారం  

ప్రొద్దుటూరు : జిల్లాలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌ ఫోన్‌కాల్స్‌ బెదిరింపు వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది.. ఎవరు బెదిరించారనే విషయంపై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్‌.రమేష్‌యాదవ్‌ల మధ్య విభేదాలు సృష్టించడానికే ఇలా చేసి ఉండొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మున్సిపల్‌ ఇన్‌చార్జి మాజీ చైర్‌పర్సన్‌ ఆర్‌.వెంకటసుబ్బయ్య కుమారుడైన రమేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌లో అబాకస్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తుండేవారు. మూడేళ్ల క్రితం ఆయన ప్రొద్దుటూరుకు వచ్చి ఆర్‌వీఎస్‌ సోషల్‌ సపోర్టు ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటిని గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సహించారు. అలాగే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా నిలిపేందుకు ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేశారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఆదేశాలతో సామాజిక సమీకరణాల్లో భాగంగా చివరి సమయంలో చేనేత వర్గానికి చెందిన భీమునిపల్లి లక్ష్మీదేవిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం ఆదేశాలను ఎమ్మెల్యే శిరసావహించాల్సి వచ్చింది. రమేష్‌ యాదవ్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు ఒకింత డబ్బు ఖర్చు చేయగా ఎమ్మెల్యే రెండింతలు ఖర్చు చేయాల్సి వచ్చింది. పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన ఎమ్మెల్యే పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. రమేష్‌ యాదవ్‌ చేత డబ్బు ఖర్చు పెట్టించారని ప్రతిపక్షాలు విమర్శించగా తన డబ్బును తిరిగి ఇస్తానని మీడియా ద్వారా స్వయంగా ఎమ్మెల్యే వివరించారు.

ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే కృషి:
మున్సిపల్‌ చైర్మన్‌గా అవకాశం కోల్పోయిన రమేష్‌యాదవ్‌కు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం కల్పించాలని ఎమ్మెల్యే ఆలోచించారు. అదే సమయంలో ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయించింది. ఈ విషయంపై అవగాహన ఉన్న ఎమ్మెల్యే రాచమల్లు రమేష్‌ యాదవ్‌ సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయంపై మూడు మార్లు సీఎంతో ఎమ్మెల్యే భేటీ అయినట్లు తెలిసింది. ఏది ఏమైనా మూడు నెలల క్రితం కౌన్సిలర్‌ అయిన రమేష్‌ యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించడంలో ఎమ్మెల్యే సఫలీకృతులయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపల్‌ చరిత్రలో కౌన్సిలర్లు ఎవ్వరూ ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేదు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్‌ యాదవ్‌ గత నెల 21న ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత నాలుగు రోజులకే ఇంటర్నెట్‌ కాల్స్‌ ద్వారా ఆయనకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. జూన్‌ 26వ తేదీన కౌన్సిలర్‌ పదవికి రాజీనామా చేయడానికి రమేష్‌ యాదవ్‌ మున్సిపల్‌ కార్యాలయానికి రాగా అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు పాతకోట బంగారు మునిరెడ్డితో చర్చించారు.

వెంటనే బంగారు మునిరెడ్డి ఎమ్మెల్సీని డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి ఫోన్‌కాల్స్‌ బెదిరింపుపై ఆరా తీయాలని కోరినట్లు తెలిసింది. ఫోన్‌ కాల్స్‌లో నందం సుబ్బయ్య పేరును ప్రస్తావించడం వెనుక దురుద్దేశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య దూరం పెంచడానికి ఉద్దేశపూర్వకంగా ఫోన్‌ కాల్స్‌ చేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గత సోమవారం ఎమ్మెల్యే శ్రీరాములపేటలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీతో ఫోన్‌కాల్స్‌ బెదిరింపు విషయంపై మాట్లాడారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించడానికి చేసిన ప్రయత్నాలను అందరికి ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. కొంత మంది ప్రతిపక్ష నాయకులు ఇదే అదునుగా భావించి ఎమ్మెల్సీని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఓ ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు