సీఎం జగన్‌ ఏలుబడిలో రాష్ట్రంలో సుపరిపాలన

15 May, 2022 16:50 IST|Sakshi

సాక్షి, పాత గుంటూరు: ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం ఒకటో డివిజన్‌ తారకరామనగర్‌లోని 3వ సచివాలయ పరిధిలో నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు. పింఛన్‌ ఒకటో తేదీనే అందుతుందా? అని వృద్ధుల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల్ని తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాలనీలోని పలు వీధుల్లో ప్రజలు మురుగు సమస్య ఉందని చెప్పడంతో వెంటనే పరిష్కరించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. 

పలువురు వృద్ధులు పింఛన్‌ రాలేదని తెలపడంతో వెంటనే మంజూరు దిశగా చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో పథకాల అమలులో వివక్ష చూపారని, ప్రస్తుత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.

ఇంటి వద్దకే పథకాలు వచ్చే విధంగా సీఎం జగన్‌ వలంటీర్, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలువుతున్న తీరుపై రూపొందించిన కరపత్రాల్ని ప్రజలకు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, కృష్ణ బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా భవాని, దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ ముంతాజ్‌ బేగం, ఒకటో డివిజన్‌ కార్పొరేటర్‌ కామిరెడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్లు యాట్ల రవి, అంబేడ్కర్, దూపాటి వంశీబాబు, ఆబిద్‌ బాష, షేక్‌ మీరావలి, వైఎస్పార్‌ సీపీ నాయకులు కేసరి సుబ్బులు, రాచమంటి భాస్కర్, పోలవరపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

(చదవండి: సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన టీడీపీ, జనసేన నేతలు)
 

మరిన్ని వార్తలు