కిరణ్‌ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే శ్రీదేవి

5 Aug, 2020 08:25 IST|Sakshi
మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ అమ్మాజీతో కలిసి కిరణ్‌ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే శ్రీదేవి 

చీరాల ఘటనలో ఎస్‌ఐ దాడిలో 

చనిపోయిన యువకుడి కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం

సాక్షి, తాడికొండ: తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి మరోసారి పెద్ద మనస్సు చాటుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్‌ఐ దాడిచేసి కొట్టిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువకుడు కిరణ్‌ కుటుంబాన్ని ఆమె మంగళవారం పరామర్శించారు. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెడపాటి అమ్మాజీతో కలిసి  మంగళవారం చీరాలలో కిరణ్‌ కుటుంబ సభ్యులను కలసి మాట్లాడిన అనంతరం చలించిపోయిన ఎమ్మెల్యే శ్రీదేవి తన సొంత నగదు రూ.1 లక్షను కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగిన కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలో దళిత యువకుడికి శిరోముండనం కేసు, చీరాల ఘటనల్లో సంబంధిత వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. చీరాల ఘటనలో ఎస్‌ఐను అరెస్టు చేయడంతో పాటు కిరణ్‌ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు  అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. (మాస్కు వివాదం.. యువకుడి బలి)

సీఎం జగన్‌ దళితుల పక్షపాతి అని, తప్పుచేస్తే ఎవరినీ క్షమించరన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఘటనలో ఇన్‌చార్జి ఎస్‌ఐ షేక్‌ ఫిరోజ్‌ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసి ఎస్‌ఐపై అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారన్నారు. విజయవాడ నడిబొడ్డులో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకలి్పంచడం ఆయనకు దళితులపై ఉన్న మక్కువకు నిదర్శనమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందని ద్రాక్షగా ఉండే ఇంగ్లిషు మీడియంను ప్రభుత్వ పాఠశాలల్లో పెడుతుంటే అడ్డుకోవాలని కుటిల బుద్ధితో కేసులు వేయించిన చంద్రబాబు దళిత ద్రోహి అన్నారు. మీరు దళితులు, మీకెందుకురా రాజకీయాలు అంటూ దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ చౌదరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే కనీసం మందలించకపోగా ఆదే వ్యక్తికి మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి సత్కరించారన్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు గతంలో అన్న మాటలు మరచి దళితులపై మొసలి కన్నీరు కార్చడం చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. దళితులకు ఇచ్చే ఇళ్ల స్థలాలను చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. (రెండు రోజుల్లో కొడుకు పెళ్లి.. కులబహిష్కరణ)

మరిన్ని వార్తలు