ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం

15 Jul, 2022 20:38 IST|Sakshi

నెల్లూరు(సెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలకు ప్రతి గడపలో ఆత్మీయ స్వాగతం లభిస్తోంది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరిస్తూ అవి సకాలంలో అందుతున్నాయా? లేదా? అని ఆరా తీస్తున్నారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. గురువారం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తమ సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజానీకం ఆశీస్సులు అందిస్తోంది. 

పథకాలు అందిస్తున్నాం 
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ నగరంలోని మూడో డివిజన్‌ వేణుగోపాల్‌ నగర్‌ ప్రాంతం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి అవి అందాయా? లేదా? అని తెలుసుకున్నారు. అర్హులందరికీ పథకాలను అందిస్తున్నట్లుగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. జగనన్నపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం 
కావలి రూరల్‌ మండలంలోని కొత్తసత్రం, రామచంద్రాపురం, పట్టణంలోని ఇందిరానగర్‌ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పథకాలు ఎవరికైనా అందలేదా? అని ఆరాతీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. 

సమస్యలు తెలుసుకుని.. 
కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలం గుండ్లపాళెంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను ఆరాతీశారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పేదల కోసం సీఎం జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

త్వరగా పరిష్కరించాలి
ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఏఎస్‌పేట బిట్‌–1లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై గురువారం ఏఎస్‌పేటలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అర్జీదారులతో మాట్లాడారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఉద్యోగులను ఆదేశించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నామని ఎమ్మెల్యే చెప్పారు. 

మరిన్ని వార్తలు