వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది..

2 Oct, 2020 16:51 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా హిమని సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, లక్ష్మణ్ రెడ్డి, యేసురత్నం తదితరులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ మాట్లాడుతూ.. గాంధీ ఆలోచనలు నేడు దేశానికి అవసరం. మత సహనం,దళితుల, ముస్లిం‌లు, పేదలపై దాడులను గాంధీజీ ఖండించారు. అన్నీ కులాలను కలుపుకుని ముందుకు నడిపిన సమగ్ర నాయకత్వం ఆయన సిద్దాంతాలలో ఉంది. దళితులు, దేవాలయాలపై దాడులు దేశానికి మంచిది కాదు. గాంధీజీ ఆలోచనలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. యుపిలో దళిత మహిళను రేప్ చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అన్నారు. (చదవండి: మహాత్ముడికి సీఎం జగన్‌ నివాళి)

‘నిజమైన గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తోంది. ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారికి దక్కుతుంది. మా ప్రభుత్వం వచ్చాక అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి. వారిలో 85 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ దళితులపై ఏదో ప్రేమ ఉన్నట్లు ప్రవర్తిస్తోంది. వారి హయాంలో దళితులపై దాడి జరిగితే చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. జగన్‌ సీఎం అయ్యాక చట్టపరంగా సీఐ, ఎస్సై స్థాయి వారిపైనా చర్యలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు, పార్టీలు దళిత ఎజెండాను అమలు చేస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగాయని టీడీపీ ఆందోళన చేసింది. వాస్తవాలు వెలికి తీస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభుత్వానికి అండగా ఉన్న దళితులను దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘాలు వారి మాటలు నమ్మొద్దు. మీకు అండగా ఉండేది మా ప్రభుత్వం. ఆర్థిక వేత్తలు చెప్తున్న ప్రజల్లోకి మనీ ఫ్లో అనే సూత్రాన్ని ఒక్క జగన్ గారు అమలు చేస్తున్నారు’ అని మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. 

‘వైఎస్సార్ కుటుంబానికి కులం లేదు.. మతం లేదు. ప్రతిపక్షానికి దేవాలయాలపై, దళితులపై మీకు ప్రేమ లేదు. దళితులను రెచ్చగొట్టడం, మత కలహాలు సృష్టించడమే పని. ప్రభుత్వాన్ని, జగన్‌ను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా అతని ఎజెండా ఎస్సీ, ఎస్టీ, బీసీల ఎజెండా నుంచి జగన్ ఎప్పుడూ పక్కకి వెళ్ళారు. ఆయా వర్గాలన్నీ జగన్ వెనుకనే ఉన్నాయి. చిత్తూరు సంఘటనలో ప్రభుత్వం చక్కగా పని చేస్తోంది. కొన్ని దళిత సంఘాలు వాస్తవాలను తెలుసుకోవాలి. పేదలకు, దళితులకు ఇల్లు ఇస్తామంటే అడ్డుకున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు. ఏదయినా సంఘటన జరిగినా రాజకీయాలకు అతీతంగా దళిత సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. (చదవండి: ‘ఏడాది కాలంగా నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోంది)

అలానే ‘కోర్టులు పరిపాలనలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయ స్థానాలపై ఉంది.  న్యాయ పరిపాలనను వదిలేసి ప్రజా పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుంది. కోర్టులు న్యాయ సమీక్ష ద్వారా ప్రజలకు న్యాయం అందించాలి. కాని కోర్టు పరిపాలన చేస్తామంటే రాజ్యాంగం అనుమతించదు. కోర్టుకు అలాంటి పోకడలు మంచిది కాదు గాంధీజీ విలువలకు అది విరుద్దం. మహానుభావులు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కోర్టులు పని చేయాలి. హైకోర్టులో జరుగుతున్న ఘటనలు ప్రజలను కలచి వేస్తున్నాయి. ప్రభుత్వంలో జోక్యం చేసుకునే న్యాయ వ్యవస్థను ప్రజలు కోరుకోవడం లేదు. పరిపాలనలో జోక్యం చేసుకుంటే రాజ్యాంగం ఉద్దేశాలే కనుమరుగవుతాయి. దీనిపై న్యాయ వ్యవస్థలు ఆలోచనలు చేయాలి. కోర్టులు కూడా సహనం కోల్పోవడం సరికాదు ఓర్పుతో వ్యవహరించాలి’ అని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు