ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

24 Nov, 2022 04:39 IST|Sakshi

మార్చిలో ఖాళీ అవనున్న 5 ఎమ్మెల్సీ స్థానాలు

ఆ స్థానాలకు తుది ఓటర్ల జాబితాలు డిసెంబరు 30న విడుదల

డిసెంబరు 9 వరకు అభ్యంతరాల స్వీకరణ

కొత్త వారు ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు అవకాశం

బూత్‌ స్థాయి ఏజెంట్లకు మార్గదర్శకాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్‌ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ముఖేష్‌ కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ జాబితాలపై డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్‌ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్‌ రోల్‌లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. 

బూత్‌ స్థాయి ఏజెంట్ల సాయం
ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్‌ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్‌లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్‌ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు బూత్‌ లెవల్‌ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు