బల్లి దుర్గాప్రసాద్‌ తనయుడికి ఎమ్మెల్సీ 

21 Nov, 2020 03:43 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కళ్యాణ్‌. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి, బొత్స, పెద్దిరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి తదితరులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ 

ఖాళీ అయ్యే తొలి సీటే కేటాయింపు 

మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి వెల్లడి 

సాక్షి, అమరావతి: తిరుపతి ఎంపీగా ఉంటూ మృతి చెందిన బల్లి దుర్గా ప్రసాద్‌ తనయుడు బల్లి కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీనియర్‌ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. దుర్గా ప్రసాదరావు కుటుంబాన్ని రాజకీయంగా అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారని తెలిపారు. తుంగ భద్ర పుష్కరాల్లో పాల్గొనడానికి బయలుదేరడానికి ముందు ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో దుర్గా ప్రసాద్‌ సతీమణి, కుమారుడు కళ్యాణ్‌ చక్రవర్తి, పార్టీ సీనియర్‌ నేతలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్తామని ముఖ్యమంత్రి వారికి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు.   

మొట్టమొదటి ఖాళీ కళ్యాణ్‌కు ఇస్తాం 
రాష్ట్ర శాసన మండలిలో మొదట ఏ స్థానం ఖాళీ అయితే.. ఆ స్థానంలో కళ్యాణ్‌ చక్రవర్తిని ఎమ్మెల్సీ చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. కళ్యాణ్‌ చక్రవర్తి రాజకీయాల్లో సుదీర్ఘంగా నడవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం, ఆకాంక్ష అని అన్నారు.   

జగన్‌కు రుణపడి ఉంటాం  
మా నాన్న కోవిడ్‌తో మరణించినప్పటి నుంచి, కష్టకాలంలో ముఖ్యమంత్రి జగన్‌ మాకు ప్రతి విషయంలోనూ అండగా నిలిచారు. ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో మొదటి స్థానం నాకు ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మా కుటుంబం మొత్తం జగన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తిరుపతి లోక్‌సభా స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అద్భుత విజయం సాధించడానికి కృషి చేస్తాం. 
   – దుర్గాప్రసాద్‌ తనయుడు కళ్యాణ్‌ చక్రవర్తి    

మరిన్ని వార్తలు