‘హుజురాబాద్‌ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు’

28 Jun, 2021 13:23 IST|Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య

సాక్షి, వైఎస్సార్‌ కడప: జలయజ్ఞం ద్వారా సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారని, రాష్ట్రానికి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నాని అన్నారు.

హుజురాబాద్‌ ఎన్నిక కోసమే భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని రామచంద్రయ్య మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా సున్నితమైన అంశమని, దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కేటాయించిన జలాలనే వాడుకుంటున్నామని, అంతకు మించి వాడుకోవడంగాని, కొత్త ప్రాజెక్టును నిర్మించడం గాని చేయడంలేదని స్పష్టం చేశారు. లేని సమస్యను ఉన్నట్లుగా సృష్టిస్తూ ప్రజలను తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని, సీఎం కేసీఆర్ మంత్రులను కంట్రోల్ చేయాలన్నారు.

ఇరు రాష్ట్రాల్లో సంపూర్ణ సాగు ప్రాజెక్టులకు జలయజ్ఞం ద్వారా లక్షల కోట్ల రూపాయల కేటాయించి నిర్మించిన మహానేత దివంగత వైఎస్సార్‌ అని గుర్తుచేశారు. ఆయన్ను నిందిస్తూ ఆరోపణలు చేయడం దారుణమని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి వైఎస్ ఎనలేని కృషి, పోరాటం చేశారని తెలిపారు. గతంలో తెలంగాణలోని చేవెళ్ల నుంచే  పాదయాత్ర ప్రారంభించారని, ఆ ప్రాంత నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు.

అన్ని ప్రాంతాలకు వైఎస్సార్‌ సాగునీరు అందించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని కృషి చేసిన వ్యక్తి వైఎస్సార్‌ అని తెలిపారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని గతంలో కేసీఆర్ కూడా అన్నారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య గుర్తుచేశారు. 
చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు

మరిన్ని వార్తలు