నేరేడుబందకు మొబైల్‌ ఆధార్‌ టీం

24 Aug, 2021 03:27 IST|Sakshi
ఆధార్‌ కార్డులు ఇప్పించాలని చేతులు జోడించి వేడుకుంటున్న ఆదివాసీ పిల్లలు

నేడు 18 మంది చిన్నారులకు ఆధార్‌ నమోదు

సాక్షి కథనానికి స్పందించిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి

ఆమె ఆదేశాలతో ఆగమేఘాలపై కదిలిన ప్రభుత్వ యంత్రాంగం

పాడేరు: ఆ మారుమూల గిరిజన తండా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతోంది. విశాఖ జిల్లా జి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దులోని నేరేడుబంద గ్రామంలో పిల్లలకు ఆధార్‌ కార్డులు అందనున్నాయి. ఈ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, దీంతో వారు ఆధార్‌ కార్డులకు నోచుకోక చదువుకు దూరం కావడంపై ‘సార్‌.. మా ఊరే లేదంటున్నారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు.

ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్నబాబు, ఇతర అధికారులు సోమవారం నేరేడుబంద గ్రామాన్ని సందర్శించారు. వారిచ్చిన నివేదికతో పీవో వెంటనే మొబైల్‌ ఆధార్‌ టీంను పంపించారు. వారు సోమవారం రాత్రికే నేరేడుబంద చేరుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలోని 18 మంది చిన్నారులకు ఆధార్‌ నమోదు చేయనున్నారు. ఆ గ్రామానికి సిగ్నల్స్‌ అందే అవకాశం లేకపోవడంతో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని జోగుంపేట ఆధార్‌ కేంద్రంలో ఆన్‌లైన్‌ చేయనున్నారు. ‘సాక్షి’ కథనంతో ఎంతోకాలంగా ఉన్న తమ సమస్య పరిష్కారం అవుతోందని నేరేడుబంద గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు